సముద్రంలో మునిగిపోతున్న జకార్తా

30-04-2024 12:05:00 AM

వాతావరణ మార్పులతో జకార్తా జలమయం

రాజధానిని మార్చే పనిలో ఇండోనేషియా 

జకార్త నుంచి కొత్త నగరం నుసంతారాకు మార్పు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు, సునామీలకు కారణమవుతుంటే మరి కొన్ని చోట్ల నగరాలను జలమయం చేసున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఇండోనేషియా రాజధాని జకార్తా నీటమునుగుతోంది. జకార్తా జావా సముద్ర వాయవ్య తీరానికి సమీపంలో ఉంది. ఈ నగరం ఇండోనేషియా రాజధాని మాత్రమే కాదు ఆ దేశంలో అతి పెద్ద నగరం. కోట్ల జనాభాకు నివాసమైన ఈ నగరం వాతావరణ మార్పుల కారణంగా మునిగిపోయే దశకు చేరుకుంది.

రాజధాని మార్పు దిశగా...

ఇండోనేషియా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తమ రాజధానిని మార్చడానికి వ్యూహాన్ని రచించింది. జకార్తా నుంచి నుసంతారాకు రాజధానిని మార్చే పనిలో పడింది. జకార్తకు 1,400 కిలో మీటర్ల దూరంలోని నుసంతారాలో ఇప్పటికే పనులకు శ్రీకారం చుట్టింది.కొత్త రాజధాని నుసంతారా నిర్మాణానికి సుమారు 35 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతోందని అంచనా, అయితే ఈ నగర నిర్మాణం 2045 వరకు కూడా పూర్తి కాదని సమాచారం. ఏది ఏమైనప్పటికీ 6వేల ప్రభుత్వ కార్మికులను అక్కడికి పంపేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

వాతావరణ మార్పులే ప్రధాన కారణం

ఈ రాజధాని మార్పునకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు ప్రధాన కారణంగా చెప్తున్నారు.కొన్ని సంవత్సరాలుగా సముద్ర జలాలు పెరుగుతున్న వేళ, ప్రపంచంలోని పెద్ద నగరాలలో తొందరగా మునుగుతున్న నగరంగా జకార్తా తొలి జాబితాలో ఉంది. ఈ క్రమంలో ఇండోనేషియా ప్రభుత్వం రాజధాని మార్పుకు ముందుకు వచ్చింది. 2019లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జకార్తా నుంచి నుసంతారాకు రాజధాని మార్పు దిశగా చట్టాన్ని ఆమోదించారు. ఇందులో భాగంగానే ఇండోనేషియా లోని తూర్పు కాలిమంతన్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో భూకంపాలు, సునామీలాంటి ప్రకృతివైపరీత్యాలు సంభవించడానికి తక్కువ ఆస్కారం ఉంది.

ప్రమాద ఘంటికలు

జకార్తాలో మునిగిన చాలా కట్టడాలు పెరుగుతున్న సముద్ర జలాల కు నిదర్శనంగా కనబడుతున్నాయి. 2050 నాటికి జకార్తాలోని 3వ వంతు సముద్రంలో మునిగిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తు న్నారు. ఇండోనేషియా ప్రభుత్వం కూడా వరదలను ఆపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ బిలియన్ల కొద్ది డాలర్లను వెచ్చిస్తోంది. 2020 నాసా విడుదల చేసిన జకార్తా ఫొటోని చూసినట్లుతై వరద ప్రభావం ఎంతలా ఉందో అంచనా వేయొచ్చు. అయితే రాజధాని మార్పు దిశగా ఇండోనేషియా అధ్యక్షుడు 2022 జూలైలో నిర్మాణం ప్రారంభించారు.