4 రోజులు.. 1, 800 కిలోమీటర్లు

30-04-2024 12:10:00 AM

అరెస్టును తప్పించుకునేందుకు నటుడు సాహిల్ ఖాన్ విశ్వ ప్రయత్నం

బెట్టింగ్ యాప్ కేసులో ఎట్టకేలకు అరెస్ట్

ముంబై, ఏప్రిల్ 29 : నాలుగో రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో దాదాపు 1,800 కిలోమీటర్ల ప్రయాణం.. ఇది మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ చేసిన విశ్వ ప్రయత్నం. అరెస్ట్ కాకుండా ఉండేందుకు అడ్వెంచర్స్ చేసినా పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. ఎట్టకేలకు శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల చేతికి చిక్కాడు. 

రాష్ట్రాలు దాటుతూ..

ఏప్రిల్ 25న తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన తర్వాత సాహిల్ ఖాన్ అరెస్ట్‌ను తప్పించుకోవడానికి రోడ్డెక్కాడు. రాష్ట్రాలు దాటుతూ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. మొదట మహారాష్ట్ర నుంచి గోవా, అక్కడి నుంచి కర్ణాటకకు, అటునుంచి హైదరాబాద్‌కు చేరుకు న్నాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషాలు మార్చాడు. సాహిల్ జాడ పసిగట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. ముంబై పోలీసులు 72 గంటల పాటు సాహిల్‌ను అవిశ్రాంతంగా ట్రాక్ చేశారు. చివరికి అతడిని అరెస్ట్ చేసి రెండు మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సాహిల్ ఖాన్‌కు ముంబై కోర్టు మే 1 వరకు పోలీసు కస్టడీ విధించింది. డిసెంబర్ 2023లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాహిల్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురికి మహాదేవ్ బెట్టింగ్ కేసులో సమన్లు జారీ చేశారు. విచారణ సమయంలో సాహిల్ యాప్ తరఫున ప్రచారం చేయడంలో పాల్గొన్నారని అధికారులు గుర్తించారు.