20 June, 2026 | 2:38 AM

హైదరాబాద్‌లో జనసేన కార్యాలయం

20-06-2026 12:47 AM
  1. మణికొండలో ప్రారంభించిన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
  2. తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యం!
  3. జీహెచ్‌ఎంసీ ఎన్నికలే తొలి టార్గెట్?

రంగారెడ్డి, జూన్ 19 (విజయక్రాంతి): ఏపీలో శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణపై తన రాజకీయ దృష్టిని కేంద్రీకరించింది. తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక అడుగు వేశారు.

హైదరాబాద్‌లోని మణికొండ (మల్కం చెరువు సమీపంలో) నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముందుగా జనసేన పార్టీ జెండాను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నూతన కార్యాలయంలోకి ప్రవేశించారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టంలోని నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలు, పార్టీ ముఖ్య నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జనసేన జెండాలు, బ్యానర్లు, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలతో మణికొండ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.

గ్రేటర్ ఎన్నికలే తొలి లక్ష్యం!

తెలంగాణ రాజకీయాల్లో జనసేన చాన్నాళ్ల తర్వాత మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పొత్తులు ఉన్నా లేకపోయినా, ఒంటరిగానైనా సరే జీహెఎంసీ ఎన్నికల బరిలో నిలుస్తామని పవన్ కల్యాణ్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలను ఒక సవాల్‌గా తీసుకుని క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు ఈ నూతన కేంద్రాన్ని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గ్రామ స్థాయి నుంచి కమిటీల బలోపేతం

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల బలోపేతం, ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను ఆహ్వానించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ప్రజల సమస్యలపై పోరాడేందుకు త్వరలోనే పవన్ కల్యాణ్ స్వయంగా తెలంగాణ అంతటా పర్యటించే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా ‘సేన ప్రస్థానం’ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావించడం, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

పవన్ కల్యాణ్ తెలంగాణ ఎంట్రీపై అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, జనసేన మాత్రం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన విజయ ఉత్సాహంతో ఉన్న జనసైనికులకు ఈ నూతన కార్యాలయం ఒక కొత్త ఊపును ఇచ్చింది. ఈ కార్యాలయం కేంద్రంగానే తెలంగాణలో జనసేన తన తదుపరి పొలిటికల్ రోడ్ మ్యాప్‌ను ఎలా సిద్ధం చేసుకోబోతోందనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.