పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన జేసీఐ
బండ్లగూడలో అదనపు గదులు, చిన్న హాల్ నిర్మాణం
నాగోల్, మే 29 (విజయ క్రాంతి): బండ్లగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన అదనపు తరగతి గదులను జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఆర్పీపీ భరత్ ఎన్ ఆచార్య ప్రారంభించారు. జేసీఐ హైదరాబాద్ దక్కన్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్మించిన ఈ గదులను నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొగ్గారపు వరుణ్, జేసీఐ హైదరాబాద్ దక్కన్ అధ్యక్షుడు కుషాల్ గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుషాల్ గుప్తా మాట్లాడుతూ బండ్లగూడ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు భవానీశంకర్ గౌడ్ ద్వారా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు బొగ్గారపు వరుణ్ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి రూ.3 లక్షల వ్యయంతో రెండు అదనపు తరగతి గదులతో పాటు చిన్న హాల్ను నిర్మించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జేసీఐ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ అభినందించారు. విద్యా రంగ అభివృద్ధికి జేసీఐ సభ్యులు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. జేసీఐ హైదరాబాద్ దక్కన్ సభ్యులను జాతీయ అధ్యక్షుడు భరత్ ఎన్ ఆచార్య అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు, గ్రామ ప్రజలకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జోన్-12 అధ్యక్షుడు జేఎఫ్‌ఎస్ గౌతంకుమార్, జేసీ సీఏ సోనాల్ గుప్తా, చెరుకు భవానీశంకర్ గౌడ్, సహదేవ్ గౌడ్, సుర్వి శంకరయ్య గౌడ్, సుర్వి సురేష్ గౌడ్, కందికంటి రాఘవేందర్ గౌడ్, మెట్టు ప్రభాకర్ గౌడ్, సంస్థ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.






