వరంగల్‌లో ఏం జరిగింది?

01-05-2024 12:15:00 AM

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏప్రిల్ 28న జరిగిన ఘర్షణ, దాని తాలూకు ప్రకంపనలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఒక సభ జరుగు తుండగా కొందరు వ్యక్తులు వచ్చి అడ్డుకోవటం, గొడవ పడటం నిర్వాహకుల మీద భౌతిక దాడిచేసే వరకూ వెళ్లిందంటే అసలు ఆ సభలో ఏం జరిగింది, దాడి చేసేంత కోపం వాళ్లకి ఎందుకు వచ్చింది? కవులూ, రచయితలూ, రిటైర్డ్ ఫ్రొఫెసర్లూ పాల్గొన్న ఆ సభలో నిజంగా దేశాన్ని, మతాన్ని కించపరిచే అంశాలు ఉన్నాయా?  

‘సమూహ రైటర్స్ ఫోరం’ అనే ఒక సంస్థ ‘లౌకిక విలువలు- అనే అంశం మీద తెలుగు రచయి తలు మేధావులతో చర్చా కార్యక్రమం జరపాలనుకొంది. దానికోసం కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కవులు, రచయితలు, మేధావులనూ ఆహ్వానించింది. ఒక్కొక్కరికీ ఒక్కొక్క అంశం ఇచ్చి దానిమీద ప్రసంగించ వలసిందిగా కోరింది. దీనిలో భాగంగా ‘లౌకిక వాదం అంటే ఏమిటి? దానిని సాహిత్యానికి ఎలా అన్వయించాలి? అని గుంటూరు లక్ష్మీనర్సయ్య మాట్లాడారు.  ‘భారతదేశంలోని ఫాసిజం దాని స్వరూప స్వభావాలు’ అనే అంశం మీద జిలుకర శ్రీనివాస్ మాట్లాడారు. ‘డీ కోడింగ్ రామాయణ’ అనే అంశం మీద సౌదా అరుణ, ‘సాహిత్య రాముడు- రాజకీయ రాముడు’ అనే అంశం మీద రిటైర్డ్ ఫ్రొఫెసర్, సమూహ కన్వీనర్ కాత్యాయిని విద్మహే మాట్లాడారు. 

అయితే, ఉదయం నుంచే సభలో కొందరు ఆరెస్సెస్, ఏబీవీపీ వాళ్లు ఉన్నారని తెలిసింది. ‘మాట్లాడే విషయాలని వాళ్లుకూడా వినాలి కదా!’ అనే ఉద్దేశంతో ఎవరినీ బయటకు పంపటం, ప్రశ్నించటం చేయలేదు. కానీ, సమూహ నిర్వాహకులకు అర్థం కాని విషయం ఏమిటంటే, సౌదా మాట్లాడిన ‘డీకోడింగ్ రామాయణ’, ఫ్రొఫెసర్ కాత్యాయిని మాట్లాడిన ‘సాహిత్య రాముడు- రాజకీయ రాముడు’ అనే అంశాలు ఆరెస్సెస్, బీజేపీ వర్గాలకు మింగుడు పడలేదు. నిజానికి ఆ రెండు ప్రసంగాలూ రాజకీయపరంగా రాముడిని, రామాయణాన్ని వాడుకోవటాన్ని వ్యతిరేకించాయే తప్ప, వ్యక్తిగత భక్తి భావనను ఏ మాత్రం కించపరచలేదు.  ‘వ్యక్తిగత భక్తిని కాపాడుకోవాలి, రాజకీయాల్లోకి దేవుళ్లని తీసుకువచ్చే ధోరణిని వ్యతిరేకించాలి’ అన్న ఉద్దేశాన్ని సరైన విధంగా వాళ్లకి చేరేలా చెప్పలేదా? లేక ఇది కక్ష సాధింపుగా చేసిన దాడేనా? అన్నది మాత్రం ఇప్పటికీ కచ్చితంగా తేల్చి చెప్పలేకుండా ఉన్నది. 

జిలుకర శ్రీనివాస్ కాలర్ పట్టుకొని దాడి చేయబోతుంటే అడ్డుకున్న పసునూరి రవీందర్, మెట్టు రవీందర్‌లని పక్కకి తోసేశారు. అప్పటికే మిగతా వాళ్లంతా వారితో వాదనకి దిగారు. పోలీ స్ (ఒకే ఒక్కరు) వచ్చి వాళ్ళని బయటకి తీసుకు వెళ్లాడు. తరువాత వచ్చిన మరో నలుగురు పోలీస్ అధికారులూ, యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఒక ఈసీ అధికారి వచ్చి ఎలక్షన్ సమయంలో ఇలాంటి సభ చేయవద్దంటూ ‘సభ ముగించమని’ చెప్పారు. వాళ్ళతో వాదించిన మెట్టు రవీందర్, కాత్యాయిని విద్మహే, బిళ్ల మహెందర్, అన్వర్ ఇంకా మిగతా సమూహ సభ్యులూ, సభకి వచ్చినవాళ్ళూ అతి కష్టం మీద బులెటిన్ ఆవిష్కరించి ముగిస్తామని ఒప్పించి, ఆ మేరకు మిగతా సెషన్స్ జరగకుండానే సభ ముగించారు.  

‘డౌన్ డౌన్ అర్బన్ నక్సల్స్’ నినాదాలు

అయితే, బయటికి వచ్చేసరికి పూర్తిగా వాతావరణం మారిపోయింది. యాభై నుంచి ఎనభై మందిదాకా హాల్ ముందు నిలబడి ఉన్నారు. బయటకి వస్తున్న వాళ్లని చూడగానే ‘జై శ్రీరాం’, ‘డౌన్ డౌన్ అర్బన్ నక్సల్స్’ అంటూ అరుస్తూ ముందుకు దూసుకు వచ్చారు. పోలీసులు ఆపుతున్నా ఆగకుండా పసునూరి రవీందర్ మీద దాడి చేయటం మొదలు పెట్టారు. ‘ఇది హిందూ మత వ్యతిరేక కార్యక్రమం కాదు, దేవుణ్ని రాజకీయాలకు ఈడ్చే విధానాన్ని అడ్డుకోవటం మాత్రమే’ అని చెప్పాలనుకున్న  ప్రయత్నాలు ఫలించలేదు. బయటికి నడుస్తున్న మెర్సీ మార్గ రెట్, రూప రుక్మిణిలని అసభ్యకరమైన మాటలతో వేధిస్తూ సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ ఇరవైమంది వరకూ యువ కుల గుంపు వాళ్ల వెనుకనే రావటం మొదలుపెట్టారు. ‘మీరంతా దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్, డబ్బులకోసం రాముణ్ని తిడుతున్నారు’ అంటూ వాళ్ల వెనుకే రావటంతో అడ్డుకోబోయిన నన్ను చెప్పలేని మాటతో తిడుతూ కొట్టడం ప్రారంభించాడు ఒక యువకుడు. మెర్సీ అడ్డుకొని వాళ్లతో వాదనకి దిగగానే వెనుకనుంచి వచ్చిన పోలీస్ నా రెండు చేతులని పట్టుకొని బయటికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడికి దూసుకు వచ్చిన మరో గుంపులోని వ్యక్తులు నామీద దాడి చేస్తుంటే అడ్డుకోవటానికి కూడా అవకాశం లేకపోయింది. ఈలోపు పెద్దవాళ్లు, మహిళలు బయటికి వెళ్లిపోయారని అర్థమైంది. మేమూ ఇంకొక వెహికిల్‌లో బయటకు వచ్చేసాం. 

ఈ మొత్తం ఘటనలో ఏ ఫాసిజాన్ని అయితే అడ్డుకోవాలని ‘సమూహ- సెక్యులర్ రైటర్స్ ఫోరం’ భావించిందో అదే ఫాసిస్టు తరహా దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. భావజాల వ్యాప్తిని వ్యతిరేకించటానికి భావజాలంతోనే సమాధానం చెప్పాలన్న ఆలోచన లేకుండా భౌతిక దాడికి దిగటమే ఇక్కడ వేళ్లూనుకున్న ఫాసిజానికి నిదర్శనం. హిందువుల దైవమైన రాముడు గుడిలో, పూజగదిలో కాకుండా ఎలక్షన్ ప్రసంగాలలోనూ, పార్టీ బ్యానర్లలోను కనిపించటం ఏమిటన్న ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే సరిపోతుంది. 

మేము మతానికి వ్యతిరేకం కాదు, లౌకికత్వానికి మద్దతుగా అన్ని మతాలనూ సమానంగా చూడాలని, మతాన్ని అడ్డుపెట్టుకొని పాలనలోకి వచ్చే ప్రయత్నాలు దేశాన్ని నష్టపరుస్తాయని చెప్పాలనుకున్న ప్రయత్నం అలా వృధా అయింది. అయితే, చెప్పాలనుకున్న విషయం ‘హిందూత్వ శ్రేణుల్లో’కి వ్యతిరేక అర్థంలో వెళ్లిందని, దానివల్లే దాడి జరిగిందనీ ఆరోపణలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా భౌతికంగా దాడులు చేయటం ప్రజాస్వామ్య విరుద్ధం, భావ ప్రకటనా స్వే చ్చకు ప్రమాదకరం. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, రాజ్యాంగ వ్యతిరేక పోకడలను అడ్డుకోవటం ఈ దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరికీ ఉన్న హక్కు. ఫాసిస్టు ధోరణి ఏనాటికైనా ఈ దేశానికి ప్రమాదకరమే. అది ఏ మతమైనా, ఏ జాత్యహంకార ఆధిపత్య భావనైనా.. ఫాసిజం మన మెడమీద వేళ్లాడే పదునైన కత్తి.


దాడికి దిగిన యువకులు

సభ మొదలైన దగ్గరనుంచి ఏ గొడవా లేకుండా బాగానే జరిగింది. భోజనాల అనంతరం మళ్లీ సభ కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో లోపలికి దూసుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు మొదట వీడియోగ్రాఫర్ దగ్గరికి వచ్చి ‘నిర్వాహకులు ఎవరు?’ అంటూ గొడవకు దిగారు. బూతులు తిడుతూ, ‘మా మీటింగ్‌కి పర్మిషన్ ఇవ్వనివాడు మీకు పర్మిషన్ ఎలా ఇచ్చాడు?’ అంటూ మైకులు లాక్కుని పసునూరి రవీందర్, స్కై బాబా, జిలుకర శ్రీనివాస్‌ల  మీదకి దూసుకు వెళ్ళారు. ‘ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రావాల్సి ఉండే కానీ, ఆయన అర్జెంటు పనిమీద హైదరాబాద్ వెళ్లడం వల్ల రిజిస్ట్రార్ సభకి వచ్చారు, పర్మిషన్ ఉంది’ అని వివరించే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా బ్యానర్లని చించటానికి ప్రయత్నించారు. మెయిన్ బ్యానర్‌లో కొంత భాగాన్ని చించేసారు. ఆ ప్రయత్నాన్ని మిగిలిన వారంతా అడ్డుకోవటంతో తోపులాట జరిగింది. ‘మీరు తాగి ఉన్నారు, తర్వాత మీకు వివరిస్తాం’ అని వివరించబోయిన వరంగల్ కవి అన్వర్‌ని కుర్చీల మీదకి తోసేసారు. వచ్చిన నలుగురూ ముప్పు యేళ్లలోపు యువకులే. 

     నరేష్ కుమార్ సూఫీ