25 May, 2026 | 3:45 PM

జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ అరెస్ట్

03-11-2025 02:26 AM
  1. జేఎస్‌పీ మద్దతుదారుడి హత్య కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
  2. మాజీ ఎంపీ సూరజ్ భన్ సింగ్ కుట్రేనని అనంత్‌సింగ్ ఆరోపణ

పాట్నా, నవంబర్ 2: బీహార్ ఎన్నికల్లో భాగంగా పాట్నా సమీపంలోని మోకామాలో ఇటీవల ప్రచారంలో పాల్గొన్న జాన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) మద్దతుదారుడి దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే, జేడీయూ మోకామా అభ్యర్థి అనంత్ సింగ్‌ను ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచగా14 రోజుల జుడీషియల్ కష్టడీ విధించారు. పాట్నాలోని బ్యూర్ జైలులో అనంత్ సింగ్‌ను ఉంచనున్నారు.

పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్పీ) కార్తికేయ శర్మ నేతృత్వంలోని బృందం బార్‌లోని అనంత్ సింగ్ నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఎస్‌ఎమ్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో పాట్నా ఎస్‌ఎస్పీ కార్తికేయ శర్మ మాట్లాడుతూ, ‘దులార్ చంద్ యాదవ్ హత్యకు సంబంధించి పోలీసులు అనంత్ సింగ్, మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్‌ను అరెస్టు చేశాం’ అని తెలిపారు.

పోస్ట్‌మార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తులో ఇది హత్య కేసు అని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు ప్రత్యర్థి అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత యాదవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఎస్పీ తెలిపారు. రెండు వైపులా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశామని పేర్కొన్నారు. దర్యాప్తులో, నేరం జరిగినప్పుడు అనంత్ సింగ్ తన సహచరులతో కలిసి సంఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు నిర్ధారించారని చెప్పారు. అయితే మోకామా నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి భర్త, మాజీ ఎంపీ సూరజ్ భన్ సింగ్ తనపై కుట్ర పన్నారని అనంత్ సింగ్ ఆరోపించారు.