జీవన్‌రెడ్డి అలక!
- కాంగ్రెస్‌లో జగిత్యాల ఎమ్మెల్యే చేరికతో..
పదవికి రాజీనామా చేస్తానంటూ అసంతృప్తి
బుజ్జగించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్
జీవన్‌రెడ్డికి న్యాయం చేస్తామని హామీ
ఇంటికెళ్లి మాట్లాడిన ఇద్దరు విప్‌లు
హైదరాబాద్/జగిత్యాల, జూన్ 24 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు అని, కష్ట కాలంలో సైతం వెన్నంటి ఉండి నాయకులు, కార్యకర్తలను ముందుకు నడిపించారని, అధిష్ఠానంతో మాట్లాడి జీవన్‌రెడ్డికి న్యాయం చేస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీవన్‌రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. గౌరవంలేని చోట ఉండలేమన్న రీతిలో ప్రభుత విప్‌లు లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్‌ల ముందు జీవన్‌రెడ్డి ఆవేదనను వెళ్లగక్కారు. దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం రాత్రి జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను సముదాయించారు.
పార్టీ అధిష్టానంతో చర్చించి తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా జీవన్‌రెడ్డి ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తున్నది. సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలియగానే ఆదివారం రాత్రి నుంచే జగిత్యాల కాంగ్రెస్‌లో నిరసనలు మొదలయ్యాయి. సోమవారం పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు జీవన్‌రెడ్డిని కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం తీరుతో ఖంగుతిన్న ఎమ్మెల్సీ సైతం తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపర్చడంతో పాటు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాన నడం కాంగ్రెస్‌ను కలవరానికి గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సముదాయించేందుకు ప్రయత్నించారు. మరో మంత్రి శ్రీధర్‌బాబు, జిల్లాకు చెందిన ఇద్దరు విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
జీవన్‌రెడ్డిని వదిలించుకోవడానికే..
ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం హఠాత్తుగా జరిగిన పరిమాణం కాదని, జీవన్‌రెడ్డిని వదిలించుకోవడానికే కొందరు నాయకులు చేసిన చర్యగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డిసెంబరులో అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచే జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు టచ్‌లోకి వెళ్లారని తెలుస్తున్నది. ఎంపీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం, తదుపరి జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవన్‌రెడ్డి, సంజయకుమార్‌లు పరస్పరం విమరలు చేసుకోవడంతో రాజకీయం వేడిక్కింది. ఈ సమయంలో సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందని అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి.
ముందుగా చేరితే జీవన్‌కు మద్దతివ్వాల్సి వస్తుందని..
ఎంపీ ఎన్నికలకు ముందే సంజయ్ కాంగ్రెస్‌లో చేరడం డిసైడ్ అయినా ఎన్నికలు ముగిసేవరకు వేచి చూసినట్లు భావిస్తున్నారు. ముందే కాంగ్రెస్‌లో చేరితే జీవన్‌రెడ్డి గెలుపుకోసం పనిచేయాల్సి వస్తుందని, ఎంపీగా గెలిస్తే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగిస్తుందని భావించిన సంజయ్.. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో ఉండి జీవన్‌రెడ్డిని ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించినట్లు సమా చారం. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఓడిపోయిన జీవన్‌రెడ్డి అధిష్ఠానం దృష్టిలో బలహీనుడవుతాడని, అప్పుడు తాను చేరితే భవిష్య త్తుకు ఢోకా ఉండదన్న ఉద్దేశంతోనే సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పద్మవ్యూహంలో జీవన్‌రెడ్డి
నిజమాబాద్ ఎంపీగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి అనంతరం పాత్రికేయులతో మాట్లా డుతూ.. నిజమాబాద్‌లో గెలిస్తే క్షురుక్షేత్రంలో గెలిచిన అర్జునుడిని అవుతానని, ఓడిపోతే పద్మవ్యూహంలో అభిమన్యుడిని అవుతానని వ్యాఖ్యానించారు. ఎన్నికల పద్మవ్యూహం ఏమోగానీ కాంగ్రెస్ పద్మవ్యూహం లోనే జీవన్‌రెడ్డి చిక్కుకుపోయారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నా జీవన్‌రెడ్డిపై అవినీతి మచ్చలు, విమరలు లేవనే చెప్పాలి. కరీంనగర్ వ్యాప్తంగా ఆయన ప్రభావం ఉన్నది.
జీవన్‌రెడ్డికి చెక్ పెట్టిన ముగ్గురు
కొన్నేండ్లుగా జీవన్‌రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుతంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి జీవన్‌రెడ్డి పొడ గిట్టకుండా అయినట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. జీవన్‌రెడ్డి పార్టీలో ఉంటే తమకు ఎలాంటి గుర్తింపు ఉండదని వారు భావించి జీవన్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు పథకం రచించినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే జగిత్యాలకు చెందిన కీలక కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కొండగట్టు వద్ద ఉన్న ఒక ప్రదేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో రహస్య సమావేశమై సీఎంను కలువాలని సూచించి కథకు ఆజ్యం పోసినట్లుగా తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై సీనియర్ల అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి పూర్తిగా మెజార్టీ ఉండగా, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు అవసరమా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో బీఆర్‌ఎస్‌లో చేరికలపై చేసిన విమర్శలను మర్చిపోయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలాగా పార్టీలో చాలామంది నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరికపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డికే రాజకీయంగా ఎసరుపెట్టడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






