కేసు కొట్టేయాలని హైకోర్టుకు కేసీఆర్
- రైల్‌రోకో కేసుపై నేడు విచారణ
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై నమోదైన రైల్‌రోకో కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్లకుంట్ల చంద్రశేఖర్‌రావు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ చేయనున్నారు. తనపై కేసు నమోదుకు ఏ విధమైన ఆధారాలు లేకున్నా పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేశారని, తన పేరును నిందితుల జాబితాలో చేర్చారని తెలిపారు.
రాష్ట్ర సాధన కోసం 2011 అక్టోబరు 15, 16, 17 తేదీల్లో రైల్‌రోకో నిర్వహించాలని కేసీఆర్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం పిలుపు ఇచ్చారని చెప్పి పోలీసులు ఏకపక్షంగా నమోదు చేశారని వివరించారు. రైల్‌రోకోకు పిలుపు ఇచ్చినట్లుగా కొందరి మౌఖిక వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారని, మౌలాలి స్టేషన్‌లో జరిగే రైల్‌రోకోలో పాల్గొనాలని ఉద్యమకారులను పురిగొల్పినట్లు పేర్కొనడం తప్పన్నారు. తాను పిలుపు ఇవ్వలేదని, ప్రత్యక్షంగా పాల్గొనలేదని తెలిపారు.
దాదాపు 40 మంది పాల్గొన్న ఈ ఆందోళనకు కల్వకుంట్ల కవితతో పాటు కొందరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిస్తే వారికి బెయిల్ కూడా లభించిందని వెల్లడించారు. ఆ కేసులో కొందరు పరారీలో ఉన్నారని చెప్పి తన పేరును కేసులో చేర్చుతూ పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారని చెప్పారు. ప్రజాప్రతినిధులపై విచారణ చేసే ప్రత్యేక కోర్టు నెంబర్ కూడా ఈ కేసుకు కేటాయించిందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితుల జాబితాలో పేరు చేర్చడం అన్యాయమని, వెంటనే కేసును కొట్టేయాలని అభ్యర్థించారు.






