భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
- 44 మందికి స్థానచలనం
పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ పీఎస్‌గా సవ్యసాచి ఘోష్
విద్యుత్ శాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రోస్
జీఏడీ కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి
ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ సుల్తానియా
రంగనాథ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ బాధ్యతలు
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలను సమూలంగా ప్రక్షాళన చేయడంలో భాగంగా రేవంత్‌రెడ్డి సర్కారు ఈ ట్రాన్స్‌ఫర్లకు పూనుకుంది. ఇప్పటికే ఒకసారి ఐఏఎస్, మరోసారి ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. మూడోసారి మాత్రం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ బదిలీల్లో పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్, విద్యుత్ శాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది.
గొర్రెల స్కామ్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ సవ్యసాచి ఘోష్‌ను సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడం ప్రాధాన్యం సంతరిచుకున్నది. అలాగే విద్యుత్ కొనుగోళ్లపై ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ కార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీని ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, విపత్తు నిర్వహణ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ కే రమేశ్‌నాయుడును డైరెక్టర్ జనరల్ పోలీస్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. అంతేకాకుండా పలువురి ఐఏఎస్‌లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది.







