24 April, 2026 | 1:23 AM

జోరుగా జెట్టి బేరం

24-04-2026 12:00 AM

మళ్లీ ‘వాయిదా’ కొనుగోళ్లు చార్జీల పేరుతో కోతలు 

కేసముద్రం, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): యాసంగి సీజన్లో పండించిన మొక్కజొన్న, వరి పంట ఉత్పత్తులను విక్రయించడానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు మిల్లులు, ట్రేడింగ్ కంపెనీల వద్ద విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో (డైరెక్ట్ సేల్) జెట్టీ వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యాపారుల వద్దకు ధాన్యం, మక్కలను విక్రయించేందుకు వస్తున్నా రైతులను అందిన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మక్కలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలకు 2,400 రూపాయలు ధర ఉండగా, ధాన్యానికి బోనస్ తో కలుపుకొని 2,800 వందల రూపాయలు ఉండగా, ప్రైవేట్ ట్రేడర్లు మక్కలకు కనిష్టంగా 1,700, గరిష్టంగా 1,900 రూపాయలు మాత్రమే ధర పెడుతున్నారని, ఇక సన్నధాన్యానికి క్వింటాలకు 1,900 నుంచి 2,200 రూపాయల ధర పెడుతూ ‘మద్దతు’ ధర ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. 

చార్జీల పేరుతో దోపిడీ!

రైతులు నేరుగా పంట ఉత్పత్తులను ట్రాక్టర్ల ద్వారా తెచ్చి వే బ్రిడ్జి కాంటా వేయించి వ్యాపారి వద్దకు తీసుకువెళ్లి అక్కడ దిగుమతి చేస్తుండగా, వే బ్రిడ్జి కాంటా ప్రకారం తూకం ఆధారంగా బస్తాలుగా లెక్క కట్టి, హమాలి, దడువాయి, కూలీల పేరుతో బస్తాకు 20 నుంచి 23 రూపాయల చార్జీ కోత విధిస్తూ అటు కార్మికులకు ఇవ్వకుండా ఇటు రైతులకు శఠగోపం పెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మార్కెట్లో, మార్కెట్ పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల సమయంలో బస్తాకు కేవలం 17 రూపాయల ఛార్జి మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా అధిక చార్జీలు వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. 

మళ్లీ మొదలైన వాయిదా పద్ధతి కొనుగోల్లు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో పలువురు ట్రేడర్లు మళ్లీ వాయిదా పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే నగదు చెల్లింపులు జాప్యం అవుతున్న నేపథ్యంలో, కొందరు రైతులు అత్యవసరమని ప్రైవేట్ ట్రేడర్ల వద్దకు వెళ్లి తక్కువ ధరకు దాన్యం, మక్కలను విక్రయిస్తున్నారు. అయితే రైతులకు వెంటనే చెల్లింపులు చేయకుండా మూడు రోజుల నుండి ఐదు రోజుల వరకు వాయిదాలు పెడుతూ వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

అటు ఆశించిన ధర పెట్టకుండా, ఇటు చార్జీలు పేరుతో కోతలు పెడుతూ, తరుగు పేరుతో ట్రాక్టర్కు 30 కిలోలు మినహాయించుకుంటూ, ఇంకోవైపు వాయిదా పద్ధతి అమలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాయిదా రూపంలో వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే కేసముద్రం మార్కెట్ పరిధిలో పలువురు వ్యాపారులు ఇలా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు మార్కెట్లో వసతులు కల్పించి, మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

వాయిదా పద్ధతి ద్వారా సరుకులు విక్రయించవద్దు

వాయిదా పద్ధతి ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించవద్దు. వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించగానే డబ్బులు చెల్లించే ట్రేడర్లకు మాత్రమే విక్రయించాలి. వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసినా రైతులు చార్జీలు ఒకే రూపంలో చెల్లించాలి. బస్తాకి 17 రూపాయలు మాత్రమే చార్జీగా వసూలు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, అదనంగా చార్జీలు వసూలు చేసినా మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. 

- అమరలింగేశ్వర రావు, ప్రత్యేక హోదా కార్యదర్శి, కేసముద్రం మార్కెట్