సంభాల్‌లో జ్యుడీషియల్ కమిషన్ పర్యటన
లక్నో, డిసెంబర్ 1: ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదు ప్రాంతంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్ ఆదివారం పర్యటించింది. అల్లర్లు చెలరేగడానికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సంభాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకుంది. అలాగే సర్వే సందర్భంగా ఘర్ష ణలు చోటు చేసుకోకుండా ఉండటానికి అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలపై కమిషన్ ఆరా తీసింది.
కాగా, సంభాల్‌లో మొఘలుల కాలం నాటి షాహి జామా మసీదు ప్రాంతంలో దేవాలయం ఉందని కొందరు హిందువులు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన కోర్టు గత నెల 19 మసీదు ప్రాంతంలో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో సర్వే సందర్భంగా నవంబర్ 24న ఆ ప్రాంతం హింసాత్మకంగా మారింది. అల్లర్లలో ఐదుగురు మరణించారు. ఈ నేపథ్యంలో అల్లర్ల వెనక కుట్ర కోణం ఏదైనా దాగి ఉందేమోనన్న ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.






