4 July, 2026 | 2:49 AM

యాప్ లోపం.. రైతుకు శాపం..!

04-07-2026 01:47 AM

యూరియా కోసం అన్నదాతకు తప్పని తిప్పలు

పూర్తి సాగు వివరాలు నమోదు కాక ఎరువుల కేటాయింపుపై ప్రభావం

సాంకేతిక సమస్యలతో వ్యవసాయ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

యాప్లో సవరణలు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి

చివ్వెంల, జూలై 3: రైతుల సాగు వివరాల నమోదు కోసం వ్యవసాయ శాఖ వినియోగిస్తున్న ఫెర్టిలైజర్ యాప్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంటల పూర్తి సాగు వివరాలు నమోదు కాకపోవడంతో అవసరమైన మేర ఎరువులు అందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు ఇలా : 

ఒక రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉండి, అందులో ఒక ఎకరం వరి, ఒక ఎకరం మిర్చి, రెండు ఎకరాలు పత్తి సాగు చేస్తే యాప్లో ముందుగా ఒక ఎకరం వరి వివరాలు నమోదు చేసిన తర్వాత మిగిలిన పంటల వివరాలను నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికే వివరాలు సమర్పించినట్లు చూపిస్తూ మిగిలిన సాగు వివరాలను నమోదు చేయనివ్వడం లేదు.

ఎరువుల కెటాయింపుపై ప్రభావం 

 రైతుల పూర్తి సాగు విస్తీర్ణం నమోదు కాక, ఎరువుల కేటాయింపుపై తీవ్ర ప్రభావం పడుతోంది. నాలుగు ఎకరాల సాగుకు అవసరమైన యూరియా అందాల్సి ఉండగా, యాప్లో నమోదైన ఒక ఎకరాకు మాత్రమే కేవలం రెండు బస్తాలు కేటాయిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు యూరియా బుకింగ్ చేసుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైతుల ఆవేదన :

యాప్లో ఇప్పటికే నమోదు చేసిన వివరాలను సవరించుకునే అవకాశం కల్పించాలని, మిగిలిన పంటల వివరాలు నమోదు చేసుకునే విధంగా సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ సీజన్లో ఎరువులు అందకపోతే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూరియా బుక్ కావట్లేదు 

నాకు నాలుగు ఎకరాల భూమి ఉం ది. అందులో వరి, మిర్చి, పత్తి సాగు చేస్తున్నాను. ఫెర్టిలైజర్ యాప్లో మొదట ఒక ఎకరం వరి వివరాలు నమోదు చేసిన తర్వాత మిగిలిన పంటల వివరాలు నమోదు కావడం లేదు. దీంతో యూరియా బుకింగ్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక ఎకరానికి మా త్రమే ఎరువులు అందుతుండగా, మిగిలిన మూడు ఎకరాలకు అవసరమైన యూరియా పొందలేకపోతున్నాం. యా ప్లోని సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించి రైతుల ఇబ్బంది తొలగించాలి. 

డి.మోతిలాలు, 

రైతు సూర్యనాయక్ తండ

 సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

ఫెర్టిలైజర్ యాప్లో రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం. సాగు వివరాల నమోదు, ఎరువుల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, యాప్లో అవసరమైన సవరణలు జరిగేలా కృషి చేస్తాం.

డి. వెంకటేశ్వర్లు, ఏ ఓ, చివ్వెంల