03-05-2025 08:21:12 PM
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కెనాల్ పాకేజ్-3 లో సున్నపురాళ్ళ తండా నుండి కుడికిల్ల వరకు పెండింగ్ లో ఉన్న మూడున్నర కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ వరకు పాలమూరు ద్వారా కృష్ణ నీరు తరలించవచ్చని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసంపూర్తిగా ఉన్న మూడున్నర కిలోమీటర్ల పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు పంప్ హౌస్ వద్ద పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్టు పనుల్లో నిర్లక్ష్యం కారణంగా రెండు పంపులు ధ్వంసం అయ్యాయని వాటిని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువల సామర్థ్యాన్ని కూడా పెంచాలని డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిలు పాలమూరు ప్రాజెక్టు సందర్శనార్థం పర్యటించినప్పటికీ పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నట్లు కనిపించలేదన్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పెండింగ్ ప్రాజెక్టులను 100% పూర్తి చేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయం అన్నారు. కానీ పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న ఆ మూడున్నర కిలోమీటర్ల పనులను పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో అలసత్వం వహిస్తున్నట్లు తేటతెల్లమవుతుందన్నారు.