జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి
10 మంది యాత్రికులు మృతి
33 మందికి తీవ్ర గాయాలు
శ్రీనగర్, జూన్ 9: జమ్ముకశ్మీర్‌లో ఓ తీర్థయాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడిచేయటంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో రియాసీ జిల్లాలోని శివ్‌ఖోరా ఆలయం నుంచి భక్తులు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన భద్రతాబలగాలు రాత్రి 8:30 గంటల వరకు శ్రమించి మృతదేహాలతోపాటు క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చాయి. గాయపడ్డవారిని రియాసీ, త్రెయాత్, జమ్ములోని దవాఖానల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించటంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో అది లోయలోకి దూసుకెళ్లిందని రియాసీ జిల్లా ఎస్పీ మోహిత్ శర్మ తెలిపారు. ఉగ్రవాదుల కోసం సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
ఉగ్రవాదులు రాజౌరీ, పూంచ్, రియాసీ ప్రాంతంలోని ఎత్తయిన కొండలపై నక్కి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ముష్కరులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.






