calender_icon.png 12 September, 2024 | 11:47 PM

కమల వికాసం!

06-08-2024 12:00:00 AM

కమలాహ్యారిస్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది. గత నాలుగేండ్లుగా ఆమె అందరికీ సుపరిచితమే అయినా..ఇప్పుడు మరింత పాపులారిటీ సంపాదించారు. అందుకు కారణం అగ్రరాజ్యం అధ్యక్ష రేసులోకి దూసుకురావటమే. ఆమెను అధికార డెమోక్రాటిక్ పార్టీ ఇటీవలే అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కమల ఎవరు? ఆమె మూలాలేమిటి అనే వెదుకులాట మళ్లీ మొదలైంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రచారం మొదలైప్పుడు ఈసారి పోరాటం ఇద్దరు వృద్ధ ఉద్ధండ పిండాల మధ్య అని అందరూ అనుకొన్నారు. కానీ, రెండు నెలల్లోనే అనేక అసాధారణ, నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నా యి.

వీటిలో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరగటం ఒకటైతే, డెమోక్రాట్ల అభ్యర్థిత్వం నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ తప్పుకోవటం మరొకటి. ముఖ్యంగా జో బైడన్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవటంతో ఈసారి ఎన్నికలు చరిత్రాత్మకంగా మారాయి. ఎందుకంటే ఈసారి అధ్యక్ష రేసులో ఓ మహిళ సగర్వంగా నిలబడింది.

అందు నా ఆమె పూర్తిగా అమెరికా మహిళ కూడా కాదు. తెల్ల మహిళ అంతకన్నా కాదు. ఆమే.. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. ఎన్నికల్లో నిలబడటమే కాదు.. ట్రంప్‌ను వెనక్కు నెట్టి ప్రచారంలో, ప్రజాదరణలో దూసుకుపోతున్నది. పరిస్థితులు ఇలాగే ఉంటే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిని ప్రపంచం చూడటం ఖాయం.

కమల దూకుడును అడ్డుకొనే తొందరలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అపార అనుభవం కూడా ఉన్న ట్రంప్ తప్పటడుగులు వేస్తున్నారు. కమలను జాతిపేరుతో అవమానిస్తూ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలు కమలకు మరింత మద్దతు తెచ్చిపెట్టాయి. 

భారతీయ మూలాలు

కమాలా హ్యారిస్ మూలాలు మూడు దేశాలతో ముడిపడి ఉన్నాయి. ఆమె తల్లి భారత్‌లోని తమిళనాడుకు చెందిన వారు. తండ్రి జమైకన్ నల్లజాతీయు డు. భర్త అమెరికన్. ఆమె పుట్టుకతోనే అమెరికా పౌరురాలు. కమల తల్లి శ్యామలా గోపాలన్ అమెరికాలోని బెర్క్‌లేలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడే ఆమే డొనాల్డ్ హ్యారిస్‌ను కలిశారు. వారు ప్రేమించి పెండ్లి చేసుకొన్నారు.

కమల తల్లి శ్యామల మహా మేధావి. 25 ఏండ్లకే ఆమె న్యూట్రిషన్ ఎండోక్రనాలజీలో అమెరికాలో పీహెచ్‌డీ చేశారు. కమల 2019లో రాసిన ‘ట్రుత్స్ వి హోల్డ్: యాన్ అమెరికన్ జర్నీ’ అనే గ్రంథంలో తన తల్లి భారత్ నుంచి అమెరికాకు సాగించిన జీవన ప్రయాణం గురించి వివరించారు. ‘మా అమ్మ అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థి’ అని కొనియాడారు.

నిజానికి అమెరికాలో చదువు అయిపోగానే శ్యామల తిరిగి భారత్‌కు వస్తుం దని, రాగానే వివాహం జరిపించాలని ఆమె తల్లిదం డ్రులు పెండ్లి సంబంధాలు కూడా చూశారట. కానీ, అన్నీ అనుకున్నట్టు కావు కదా! యూనివర్సిటీలో చదువుతున్న ప్పుడు శ్యామల పౌర హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. డొనాల్డ్ హ్యారిస్‌కు కూడా ఈ ఉద్యమాల పై ఆసక్తి ఉండేది.

దీంతో వీరి మనసులు కలిసి 1963లో పెండ్లితో ఒక్కటయ్యారు. దీంతో ఆమె అమెరికాలోనే స్థిరపడిపోయారు. తాను ఒక అద్భుతమైన కుటుంబంలో పుట్టి పెరిగానని కమల తన పుస్తకంలో చెప్పుకొన్నారు. ‘నా తల్లి, అమ్మమ్మ, తాతయ్య, అత్తలు, మామలు అంతా దక్షిణా సియా మూలాలు ఉన్నవారు.

మాకు (కమలకు మాయ అనే ఓ చెల్లె లు కూడా ఉన్నది) పెట్టిన భార తీయ సంప్రదాయ పేర్లే మేము ఎలాంటి వాతావరణంలో పెరిగా మో చెప్తాయి. మేము పెద్దవుతు న్నాకొద్ది భారతీయ సంస్కృతిపై లోతైన అవగాహన పెంచుకోగలిగాం. కమలకు ఐదేండ్ల వయసు వచ్చేనాటికే మనస్పర్ధలతో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. 

తల్లే ఆదర్శం

కమల తన తల్లి గురించి ప్రతి సందర్భంలోనూ గొప్పగా చెప్తారు. డొనాల్డ్‌తో విడిపోయిన తర్వాత కమల తల్లి మళ్లీ వివాహం చేసుకోలేదు. తన ఇద్దరు కూతుళ్లను ఒంటరిగానే పెంచి పెద్ద చేశారు. ‘నేను నేడు ఈ స్థాయిలో ఉండటానికి మా అమ్మే కారణం. నన్ను, మాయను ఎంతో గొప్పగా తీర్చిదిద్దింది.

ఆ అమ్మకు రెండే లక్ష్యాలుండేవి. తన ఇద్దరు కూతుళ్ల జీవితాలను ఉన్నతంగా తీర్చి దిద్దటం, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను లేకుండా చేయటం’ అని కమల 2020లో ఓ సందర్భంలో చెప్పారు. అమెరికాలో శ్యామల గోపాలన్ ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ పరిశోధకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె తల్లి, తండ్రి, సోదరులు కూడా గొప్ప స్థితికి చేరుకొన్నవారే.

శ్యామల తండ్రి తూర్పు పాకిస్థాన్ (నేటి బంగ్లాదేశ్) నుంచి వచ్చిన శరణార్ధులకోసం తమిళనాడులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో పనిచేశారు. ఆ తర్వాత జాంబియా అధ్యక్షుడికి సలహాదారుగా కూడా పనిచేశారు. కమల అమ్మమ్మ సంఘ సేవకురాలిగా గుర్తుంపు పొందారు. శ్యామల సోదరుడు గోపాలన్ బాలచంద్రన్ ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (ఐడీఎస్‌ఏ)లో కన్సల్టెంట్‌గా పనిచేశారు. 

ట్రంప్‌తో అమీతుమీ

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వెనుకబడిపోవటంతో ట్రంప్ ఈసారి గెలుపు తనదేనని సంబరపడ్డారు. కానీ, అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవటం, పోతూపోతూ కమలను తన స్థానంలో ఉండాలని కోరటం.. ట్రంప్‌కు మింగుడు పడలేదు.

మొదట ‘కమలా హ్యారిస్ ప్రత్యర్థిగా ఉంటే నా గెలుపు మరింత సులువు అవుతుంది’ అని ప్రకటించిన ఆయన.. రానురాను పరిస్థితులు చేయిదాటి పోతుండటంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇటీవల నల్లజాతి జర్నలిస్టులతో ముచ్చటించిన ఆయన.. కమలపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె (కమల) ఎప్పుడూ భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేవారు.

భారతీయ సంస్కృతిని మాత్రమే ప్రచారం చేసేవారు. కానీ కొన్నేండ్ల క్రితం ఆమె నల్లజాతీయురాలిగా మారేవరకు నాకు ఆ విషయం తెలియనేలేదు. ఇప్పుడు ఆమె నల్లజాతీయురాలి గుర్తింపు కోరుకొంటున్నారు. అందువల్ల ఆమె భారతీయురాలో.. నల్లజాతీయురాలో నాకు అర్ధంకావటం లేదు’ అని వెటకారం చేశారు.

కమల చీరకట్టులో ఉన్న ఫొటోను కూడా సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కమలతో ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు కూడా మొదట ట్రంప్ అంగీకరించలేదు.

ఆమెను డెమోక్రాట్ల అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో డిబేట్‌కు సిద్ధమని తెలిపారు. దీంతో తొలిసారి ముఖాముఖి తలపడబోతున్న వీరిద్దరి మధ్య ఎన్నికల పోరాటం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.