calender_icon.png 10 February, 2026 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రెడిట్ కార్డు పేరుతో భారీ మోసం

10-02-2026 04:33:47 PM

కమిషన్ ఆశ చూపి లక్షల దోపిడీ

ముఠా అరెస్ట్ చేసిన కమలాపూర్ పోలీసులు

హనుమకొండ,(విజయక్రాంతి): పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా కమిషన్ ఇస్తామని ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. పెట్రోల్ బంకుల క్యాషియర్లు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని నిందితులు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే ప్రతి లావాదేవీపై అదనంగా కమిషన్ ఇస్తామని నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు చెప్పారు.

కమలాపూర్ ఇండియన్ పెట్రోల్ బంక్‌కు చెందిన ఓ క్యాషియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, వివిధ తేదీల్లో అతని నుంచి సుమారు రూ.49 వేల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ మొత్తాన్ని నిందితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.9 లక్షల వరకు అక్రమంగా సంపాదించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును నిందితులు ఆన్‌లైన్ బెట్టింగ్ వినోద కార్యక్రమాలు విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు ఏసీపీ తెలిపారు.

సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కదలికలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు బాధితులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆన్‌లైన్, ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు పంపవద్దని, అనుమానాస్పద లావాదేవీలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కేసు దర్యాప్తును సమర్థంగా నిర్వహించిన ఇన్‌స్పెక్టర్ నవీన్ ఎస్సై దిలీప్ పీసీలు ఉదయ్ భాస్కర్‌లను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు.