23 June, 2026 | 2:57 AM

సినిమా చూపిస్త!

23-06-2026 01:43 AM

చిట్టినాయుడూ.. బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినోడ్ని లాక్కొచ్చి నిలబెడతా

  1. నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు.. హార్డ్‌వేర్ కూడా!
  2. కాంగ్రెస్‌పై గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసు
  3. అర్జున్‌రెడ్డి సినిమా హిట్.. రేవంత్‌రెడ్డి సినిమా అట్టర్ ప్లాఫ్
  4. పంటల కొనుగోళ్లపై రైతులకు మరణ శాసనం 
  5. రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ వినాశనం
  6. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభం
  7. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అదే చరిత్ర చెబుతున్నది. అధికారంలో ఎప్పటికీ మనమే ఉంటామని అనుకోవడం కూడా అత్యాశే . కాంగ్రెస్ పాలనలో దశ దిశ లేకుండాపోయింది.  అందుకే దేశమంతా కాంగ్రెస్ పాలనను ప్రజలు వదిలించుకున్నరు. సీఎం రేవంత్‌రెడ్డిని ఎప్పుడు తరిమికొట్టాలా అని తెలంగాణ ప్రజలు  ఎదురుచూస్తున్నరు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

వరంగల్/హనుమకొండ (మహబూబాబాద్), జూన్ 22 (విజయక్రాంతి): ‘వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడు(సీఎం రేవంత్‌రెడ్డి)కు, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఒక్కొక్కడిని రిటైర్డ్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల ఆవల ఉన్నా లాక్కొచ్చి నిలబెడతా’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ‘నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు.. హార్డ్‌వేర్ కూడా.. కాంగ్రెస్‌పై గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసు.

కుర్చీ మడత పెట్టి కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని ఎప్పుడు తరిమికొట్టాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి పంటల కొనుగోళ్లపై రైతులకు మరణ శాసనం రాస్తున్నదని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ వినాశనం అయిందని, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభం నెలకొన్నదని మండిపడ్డారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని దామెర, వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, సోషల్ మీడియాపై నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కేటీఆర్ హాజరై మాట్లాడారు.

బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ నేతలు రిటైర్డ్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల ఆవల ఉన్నా లాక్కొచ్చి నిలబెడతానని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు అధైర్య పడొద్దని, వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడుకు, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత తనదేనని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. అప్పట్లో అర్జున్‌రెడ్డి సినిమా వచ్చిందని, అది సూపర్ హిట్ అని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి అనే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.

ఇంటర్వెల్ దాకా అయిపోయిన రేవంత్‌రెడ్డి సినిమాలో బూతుల మోతలు, ఎగవేతలు కూల్చివేతలే తప్పా ఏమీ లేవని ఎద్దేవా చేశారు. హామీల గురించి అడిగితే లాగులో తొండలు విడుస్తా, గుడ్లు పీకి గోలీలు ఆడుతా అంటున్నారని మండిపడ్డారు. కుర్చీ మడత పెట్టి కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని ఎప్పుడు తరిమికొట్టాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసిఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతుబంధు వేస్తే, కాంగ్రెస్ పాలనలో రైతుబంధు బంద్ అయిందని, యూరియా దొరకడం లేదన్నారు. 

బీఆర్‌ఎస్ టార్చ్ బేరర్.. కాంగ్రెస్‌కు దశ దిశ లేదు 

అని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అధికారంలో ఎప్పటికీ మనమే ఉంటామని అనుకోవడం కూడా అత్యాశ అవుతుందని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే టార్చ్ బేరర్‌గా నిలబడిందని, కాంగ్రెస్ పాలనలో దశ దిశ లేకుండా పోయిందని విమర్శించారు. అందుకే దేశమంతా కాంగ్రెస్ పాలనను ప్రజలు వదిలించుకున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చేదాకా ఉద్యమం వదిలేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ప్రజలకు అధికారం ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.

కేసీఆర్ అనే మూడు అక్షరాల పదమే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని, తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా అని ఆ గులాబీ జెండానే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇంటింటా సంక్షోభం తెచ్చిందని విమర్శించారు. పంటల కొనుగోళ్లపై రేవంత్‌రెడ్డి రైతులకు మరణ శాసనం రాసిండని మండిపడ్డారు. ఒకప్పుడు కేంద్రం చెప్తే వినడానికి మోదీ బ్రోకరా అన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే పని చేస్తున్నాడని ఆరోపించారు.

సీఎం మాటలను చూస్తే వచ్చే సీజన్ నుంచి రైతన్నల పంటలు కొనే నాథుడే ఉండరనిపిస్తోందని పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రానికి కాంగ్రెస్ ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. తాను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు.. హార్ట్‌వేర్ కూడా అని, తనకు కాంగ్రెస్‌పై గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసని చెప్పారు.

గత పదేళ్ల మాదిరిగా బీఆర్‌ఎస్ ఇప్పుడు ఉండదని, పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెట్టిన వారికి తప్పనిసరిగా సినిమా చూపిస్తానని ప్రకటించారు. బీఆర్‌ఎస్ సభ్యత్వం పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన వెంటనే డిజిటల్ మెంబర్షిప్ కార్డు అందుబాటులోకి వస్తుందని, పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

వచ్చే ఐదేళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరూరి రమేష్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పాడీ కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, టి. రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సతీష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, బిఆర్‌ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, లలిత యాదవ్ పాల్గొన్నారు.