మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
జిల్లా ఎస్పీ నితిక పంత్
కాగజ్ నగర్,(విజయక్రాంతి): రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి నిబద్ధతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలోని బిఎంఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఎన్నికల విధులపై పోలీస్ సిబ్బందికి సమగ్ర బ్రీఫింగ్ ఇచ్చారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సున్నిత పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉన్నందున నలుగురికి మించి గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.




