13 April, 2026 | 3:15 PM

కంగనా మాట మాదికాదు

27-08-2024 01:53 AM
  1. రైతులపై నటి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ క్లారిటీ
  2. అవి ఆమె వ్యక్తిగతమని ప్రకటన
  3. పార్టీ విధానాలపై మాట్లాడేందుకు అనుమతి లేదని స్పష్టం  
  4. కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ బీజేపీ

న్యూఢిల్లీ, ఆగస్టు 26: రైతుల నిరసనలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్ఠానం కంగనాను మందలించింది. ఆమె వ్యాఖ్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీ తరఫున విధానపరమైన విషయాల గురించి మాట్లాడే అధికారం కంగనాకు లేదని, అందుకు బీజేపీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అంతేకాకుండా ఈ విధమైన ప్రకటనలు భవిష్యత్తులో ఎప్పుడూ చేయవద్దని కంగనాకు మొట్టికాయలు వేసింది.

ఏం అన్నారంటే?

2020లో రైతుల నిరసన కారణంగా మూడు కొత్త సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆనాటి నిరసనను ఉద్దేశించి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల నిరసనలతో భారత్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేదంటే ఉంటే ప్రస్తుత బంగ్లా పరిస్థితులు దేశంలో ఉండేవి. చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా నిరసనలు జరగడం ఆలోచించాల్సిన విషయం. స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రలే ఇందుకు కారణం అని కంగనా ఆరోపించారు. 

రాజకీయ దుమారం

ఈ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. ఇవి కేవలం ఆమె మాటలేనా? మరొకరివా? దీనిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై సొంత పార్టీనే తీవ్రంగా స్పందించింది. హర్యానా, పంజాబ్‌లోని బీజేపీ నేతలు సైతం తప్పుబట్టారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని కంగనాకు సూచించారు. ప్రధాని మోదీ, బీజేపీ రైతులకు అనుకూలంగా వ్యవహరిస్తారని తెలిపా రు. విపక్షాలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తాయని, కంగనా వ్యాఖ్యలు కూడా అదేవిధంగా ఉన్నాయని పంజాబ్ బీజేపీ నేత హర్జీత్ గ్రేవాల్ అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో వ్యాఖ్యానించడం కంగనా మానుకోవాలని హితవు పలికారు.

వివాదాలకు కేరాఫ్

గతంలోనూ కంగనా అనేక సందర్భాల్లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020లో పంజాబ్‌లో నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళా రైతును తప్పుగా గుర్తించి బిల్కిస్ బానో అని పిలిచారు. ఢిల్లీ షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న వృద్ధ మహిళను ఉద్దేశించి రూ.100 ఇచ్చి ఆమెను తీసుకొచ్చారని ఆరోపించారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ 2020లో ట్వీట్ చేశారు. 1947లో అడుక్కుంటే స్వాతంత్య్రం వచ్చిందని, కానీ నిజమైన స్వేచ్ఛ 2014లో లభించిందని 2021లో అన్నారు. అదే ఏడాది బెంగాల్‌లో ఘర్షణలకు సంబంధించి కంగనా ఆరోపణలు చేయగా.. ఆమె అధికారిక ఖాతాపై ట్విట్టర్ నిషేధం విధించింది. ఇదిలా ఉండగా చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కంగనాను చెంపదెబ్బ కొట్టడం కూడా చర్చనీయాంశమైంది.