కిమ్ అమ్ములపొదిలో మరో అస్త్రం
- సూసైడ్ డ్రోన్‌ను ఆవిష్కరించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
- డ్రోన్ల తయారీలో ఏఐ టెక్నాలజీ వినయోగం!
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఊ అంటే క్షిపణి దాడులతో విరుచుకుపడే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చేతికి మరో కొత్త అస్త్రం తోడైంది. తాజాగా ఆగస్టు 24న ఆయన స్వయంగా ‘సూసైడ్ డ్రోన్ల’ ట్రయల్ రన్‌ను నిర్వహించిన దృశ్యాలను ఆ దేశ అధికారిక ప్రతిక ధృవీకిరించింది. ట్రయల్ రన్ సందర్భంగా.. కిమ్ వైట్ కలర్ పైలెట్ డ్రెస్, క్రీమ్ కలర్ టోపీ ధరించి స్వయంగా సూసైడ్ డ్రోన్లను ప్రయోగించాడు. డ్రోన్లకు ఇచ్చిన లక్ష్యాలను పేల్చేస్తుండటంతో పాటు యుద్ధ ట్యాంకులను ధ్వంసంచేసిన తీరును చూసి కిమ్ సంబరపడిపోయారు.
ఆయా దృశ్యాలను అక్కడి పత్రికల్లోల ప్రచురించగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరిన్ని సూసైడ్ డ్రోన్లను తయారుచేయాల్సిందిగా కిమ్ అధికారులను ఆదేశించారు. ఉత్తర కొరియా, రష్యాకు మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో రష్యా సహాయంతో ఈ డ్రోన్లను తయారుచేసి ఉంటారని సమాచారం. ఉత్తర కొరియాకు.. అమెరికా నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కిమ్ జాంగ్ చేపడుతున్న సైనిక విన్యాసాలతో అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అణ్వాయుధాల తయారీలో బిజీ..
ఓ వైపు యావత్ ప్రపంచం రష్యా ఇజ్రాయెల్ దృష్టి సారిస్తే.. కిమ్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉత్తర కొరియాపై దాడి చేయాలనుకునే ప్రపంచ దేశాలకు తమ సామర్థ్యం, సైనిక బలం గురించి తెలియజేయడంతో పాటు తమ జోలికి వస్తే ఏం చేయగలమో చూడండి అంటూ కిమ్ హెచ్చరిక లు జారీ చేస్తున్నా రు. తమ దేశాన్ని పూర్తి అణ్వస్త్ర దేశంగా మార్చేందుకు కూడా కిమ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.




