రాష్ట్రంలో సూర్యుడి కన్నెర్ర!
l రాష్ట్రవ్యాప్తంగా ఎండ భగభగలు
l ఆరెంజ్ క్యాటగిరీలోకి తెలంగాణ
l మూడు జిల్లాల్లో వడగాలుల హెచ్చరికలు
హైదరాబాద్, ఏప్రిల్ 19, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. మే నెల రాకముందే 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం భద్రాచలం, నల్గొండలోని బుగ్గబావిగూడలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా 41 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాకపోవడం గమనార్హం. రాష్ట్రం మొత్తం ఆరెంజ్ కేటగిరీ (40 నుంచి 45 డిగ్రీలు)లోకి వచ్చేసింది.
దీనితో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రోడ్లపై తిరగడం చాలావరకు తగ్గిపోయింది. అత్యవసర సమయాల్లో తప్పితే మధ్యాహ్నం పూట బయటకు రావద్దని అనారోగ్యానికి గురికావద్దని ప్రజలకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. బీ రవీందర్ నాయక్ సూచించారు. వడదెబ్బకు తగిలితే వెంటనే చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేటలకు వడగాలుల హెచ్చరికలను జారీచేశారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 41.1 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






