24 August, 2026 | 2:14 AM

తెలంగాణ మట్టి పరిమళం ‘కాసర్ల’ పాట

24-08-2026 12:00 AM

‘కోలో నా పల్లె కోడి కూతల్లే/ ఒళ్లిరుసుకుందే కోడె నాగల్లె/యాప పుల్లల చేదు నమిలిందె/రామ రామ రామ రామ /తలకు పోసుకుందె నా నేల తల్లే/ అలికి పూసుకుందె ముగ్గు సుక్కల్నే/ సద్ది మూటల్నే సగ బెట్టుకుందే/బాయి గిరక నా పల్లె’ అనే పాట పక్కా సినీ గేయ రచయిత కాసర్ల శ్యాం మార్క్. ‘బలగం’ చిత్రంలోని ఈ పాట తెలంగాణ యాసను కళ్లకద్దుకున్నది. గేయరచయిత గా శ్యాం విజిటింగ్ కార్డుగా మారింది. అంతేకాదు.. ‘జాతీయ అవార్డు’నూ తెచ్చిపెట్టింది. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన ‘గేయ’కారుడు శ్యాం. పేరులోనే పోరున్న ‘వరంగల్’ జిల్లా నుంచి వచ్చిన ఈ పిల్లగాడు.. తన భాష, భావం పోటీ పడేలా స్వచ్ఛమైన పాటలు రాస్తున్నారు.

ఆయన కలం నుంచి జాలువారిన ‘మహాత్మ’ చిత్రంలోని ‘నీలపూరి గాజుల ఓ నీలవేణి నిల్సుంటే కృష్ణవేణి.. నువ్వు లంగవోణి వేసుకుని నడుస్త ఉంటే నిలవలేనే బాలామణి’ పాట ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ యాస, పల్లె సంస్కృతిని ప్రతిబింబించే పదాలతో ఈ పాట ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఆ పాట ఒక సంచలనం. లోకల్ టు గ్లోబల్.. అన్నట్టు అందరూ ఫిదా అయ్యేలా పాటలు రాయడం శ్యాం ప్రత్యేకత.

ఎన్నెల, సందమామ, గమ్మతి, సెమట సుక్కలు, చెమ్కీలు, చెంటిపోరడు, బాపతి, బంబాట్, బొట్టుబిల్ల, సిలక ముక్కు, అరుగు, వంటి.. ఎన్నో చక్కటి తెలంగాణ పల్లె పదాలను పాటదండలో గుదిగుచ్చినట్లు రాస్తున్నారు శ్యాం. ‘పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టూ బిల్ల పెట్టినట్టు’ అన్నా, ‘ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే’ అన్నా అది శ్యాంకే చెల్లింది.

ప్రతిభను నమ్ముకుని ముందుకు..

ఇంట్లో నుంచి రూ.150 తీసుకుని వరంగల్ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు వచ్చిన కాసర్ల శ్యాం సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు గట్టి పోరు చేశాడనే చెప్పొచ్చు. రూ. 30తో ఊర్లలో జానపద ప్రదర్శనలు ఇవ్వడమే కాదు, ఒక్కో గ్రామంలో ఒక్కరికి మాత్ర మే అన్నం దొరికినపుడు పస్తులున్న ‘యాది’ మరువని నైజం శ్యాంది. స్టేజీ ఆర్టిస్ట్‌గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన శ్యాం పదుగురిని ఆకట్టుకునే నైపుణ్యం సొంతం చేసుకున్నారు.

ఉన్నత విద్యావంతుడిగా ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఫిల్ జానపదం చదివి చిత్ర సీమలో రాణించాలనే పట్టుదలతో తన ప్రతిభను మాత్రమే నమ్ముకుని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగారు. చిత్ర సీమలోకి వచ్చిన తర్వాత 2003లో ‘చంటిగాడు’ చిత్రంలోని పాటల ద్వారా సినీ గేయ రచయితగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ, సుమారు పదేండ్లకు పైగా ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రఖ్యాత దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘రౌడీ’ చిత్రానికి సింగిల్ కార్డు గేయ రచయితగా పాటలందించారు.

అనంతరం క్రమానుగతంగా వచ్చిన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుని, ఇంతింతై వటు డింతై అన్నట్టుగా టాప్ సినీ గేయరచయితగా రాణిస్తున్నారు. శ్యాం తన కలం ద్వారా తెలంగాణ యాసలోని మట్టి పరిమళపు సుగంధా న్ని వెండితెరపై వెదజల్లుతున్నారు. ఆ సౌం దర్యాన్ని ప్రతిఒక్కరూ ఆస్వాదించేలా గీతాల మాలలుర కడుతున్నారు. చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా టాప్ సినీ గేయ రచయి తగా దూసుకుపోతున్న శ్యాం ప్రముఖ యాక్టర్లందరికీ గీతాలు రాయడం విశేషం.   

దునియాంతట మార్మోగేలా ‘ఆయా షేర్’

కాసర్ల శ్యాం రాసిన తాజా పాట ‘ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఆయా షేర్’ పాట. ఈ పాట గిప్పు డు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నది. పొట్టు పొట్టు వైరల్ అవుతున్నది. ఈ గీతాన్ని ఎవరికి వారు తమకు తాము ఆపాదించుకుంటూ సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు. రెం డు తెలుగు రాష్ట్రాలే కాదు పొరుగు రాష్ట్రాలు, ఆ మాటకొస్తే విదేశాల్లో సైతం పాట మార్మోగుతున్నది. ‘హేయ్.. నీ అయ్యా జాగిరా..? చల్ మావాడొచ్చిండ్రా.. ! ఇగ జడ్తియ్యాలె జుంబలికె ఆయా షేర్!!’ అంటూ మొదటి చరణా న్ని శక్తిమంతంగా రాశారు.

‘జడలురో జడలురో హడలురో దడలురో.. కొడుతరో తోడలురో.. తీస్తారో తోలురో! సవారీకి దొరుకు బిడ్డ.. శెవాలే లేస్తయ్ బిడ్డ..!!’ అనీ, ‘మొల్దారం లేనోన్నిర.. ఏం పీకుతవుర.. ప్యారడైజ్‌కు అడ్రస్ నైత!’ అంటూ కథలోని బలమైన ‘జడల్’ అనే కథానా యకు డి పాత్రను ఆవిష్కరించారు. పాటకు గాత్రం జంగిరెడ్డి, దేవయ్య అందించగా,

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇక ‘బలగం’ వేణు, కాసర్ల శ్యాం కలయికలో రాబోయే ‘ఎల్లమ్మ’ పాటలపై ప్రేక్షకుల్లో ఆకాశన్నంటేలా అంచనాలు ఉన్నాయి. కాసర్ల శ్యాం తెలంగాణ యాస పదాలు గ్లోబల్‌గా మరింత ప్రాచుర్యంలోకి తేవాలని, ఆయన మరిన్ని జాతీయ అవా ర్డులు సొంతం చేసుకుని తెలంగాణవారి సత్తా ను, కళాకారుల ఓరుగల్లు కీర్తిని మరోసారి చాటాలని ఆకాంక్షిస్తున్నాం.

 వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు