24 August, 2026 | 4:00 AM

మధురస సేవనానుభూతి

24-08-2026 12:00 AM

తెలుగు సాహిత్య ప్రపంచంలో రాశిపరంగా, వాసిపరంగా అత్యుత్తమ స్థాయిలో నిలిచే సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి. వివిధ సాహిత్య ప్రక్రియల్లో అనితరసాధ్యమైన కృషిచేసి, పాఠకులను ఆశ్చర్యా నికి గురిచేసిన కలమాయనది. చరిత్రకారుడిగా, తాళపత్రాల పరిష్కర్తగా, కవిగా, రచయి తగా, శతక కర్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, నాటక కర్తగా, బాల సాహితీవేత్తగా తెలు గు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందారాయన. శతాధిక గ్రంథ రచయితగా ప్రత్యేక ఖ్యాతి సాధించారు.

పేరున్న సాహితీవేత్తల చరిత్ర రచనతోపాటు బయటి ప్రపంచానికి పెద్దగాతెలియని రచయితలు, కవుల గురించి వెల్లడించేందుకు నిరంతరం కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఈ ‘సాహిత్య వ్యాసాలు (ప్రథమభాగం)’ గ్రంథం. ఇందులోవున్న వ్యాసాల న్నీ కవులు, పండితుల పరిచయాలతోపాటు వారి రచనల విశ్లేషణలతో కూడుకొని ఉన్నవే. కవులు, పండితుల వివరాలే కాకుండా వారి రూప వివరాలుకూడా స్పష్టంగా చెప్పడం ఈ గ్రంథంలో కనబడుతుంది. ‘హఠయోగి కం దూరప్ప’ వ్యాసంలో కందూరప్ప రూపం గురించి కింది విధంగా పేర్కొంటారు లింగమూర్తి.

‘వ్యక్తి స్ఫురద్రూపి. కండపుష్టి గూడ కలిగివుండేవాడు. కానీ, కొంచెంపొట్టి. పై రెప్పలు విశాలంగా ఉండి కన్నులెపుడూ మూసికొన్నట్లుగా కనిపించేవి. కుడి భుజం వెనుక వైపు కోడిగుడ్డంత నల్లనిపుట్టుమచ్చ ఉండేది. మోకాటిపైకి పంచె, చేతిలో తనకంటే మూరెడెత్తయిన కఱ్ఱ.

చంకలో ఒక పిచ్చిమూట. ఇది అతని వేషం’ ఇలా కందూరప్ప వేష విశేషాలను కూడా చెప్పారు లింగమూర్తి. మొహ మాటానికో మరే కారణం వలననో కొన్ని విషయాలు చెప్పగూడదన్న నియమం ఏమీ పెట్టుకోలేదాయన. మంచయినా, చెడయినా ఉన్నదున్నట్టు చెప్పడం ఆయన రచనాశైలి. చెడు అలవాట్లను కూడా అలాగే చెప్పడం ఆయన శైలి. ‘అతనికి గంజాయి అలవాటుండేది. దాన్ని ఆయన వస్తువనేవాడు. ఎవరైనా గంజాయి త్రాగరాదంటే కోపం వచ్చేది. ఇలా నెగిటివ్ విషయాలనుకూడా లింగమూర్తి చెప్పేవారు.

నిర్మొహమాట వ్యక్తీకరణ

‘ఎత్తం రామయోగి’ వ్యాసంలో కూడా ఇదే పంథానవలంబించారు. ‘రామయోగి అవధూత- ప్రపంచలక్షణాలేవీ పట్టించుకునేవాడుకాదు. చివరకు స్నానానుష్టాలుగాని, కనీస వేష మర్యాదలుకూడా పాటించకుండా హీనజాతివలె ఉండేవాడట. ఆయన యొక్క ఈ నడవడి పురోహితులకు గిట్టేది కాదు. అందుచేత తమ ఇండ్లలోనికి కూడా రానిచ్చేవారు కారట. ప్రాపంచిక విషయాలపట్ల నిర్వేదం, కనీసం స్నానం మొదలైనవి కూడా చేయకపోవడం రామయోగి లక్షణాలు. నిజానికి ప్రస్తుత ప్రపంచం వీటిని మంచి లక్షణాలుగా భావించదు. అయినప్పటికీ ఈ లక్షణాలను కూడా కప్పిపుచ్చకుండా నిక్కచ్చిగా పేర్కొనే స్వభావం లింగమూర్తిది.

ఈ లక్షణం సిసలైన చరిత్రకారులకు ఉండవలసిందే. ఈ విధంగా ఉన్నదున్నట్టుగా, వాస్తవాలను కప్పిపుచ్చకుండా చెప్పేస్వభావం కపిలవాయి లింగమూర్తిది. చరిత్రరచనలో వాస్తవాలను కప్పిపుచ్చకపోవడంతోపాటు పరస్పర భిన్నాభిప్రాయాలున్న సందర్భాల్లో తనదైన సొంత అభిప్రాయాన్ని ప్రకటించే స్వభావంకూడా లింగమూర్తిది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు తాలూకా కేంద్ర సమీపంలోని గుంటిపల్లికి సంబంధించిన విషయం అలాంటిదే. అక్కడున్న గుండును భాస్కరరాయలు అని ప్రజలు పూజిస్తుంటారు. అదే గ్రామంలో ఉండే విఠలాలయాన్ని స్థాపించినది భాస్కరుడు. ఆ ఆలయ ముఖద్వారంపై ఉన్న శ్లోకాన్ని సైతం ప్రస్తావిస్తారు లింగమూర్తి. 

భారత్యు వాక్య గంభీర రాయదీక్షిత సూరిజః

భాస్కర స్థాపయ మాస విఠలం కులదైవతం.. ఈ శ్లోకంలో పేర్కొన్న భాస్కరుడు, గుండుభాస్కరరాయలు ఒక్కరేనా అనేది చాలా మందికి వచ్చే సందేహం. ఈ విషయంలో నిర్ద్వంద్వంగా తన అభిప్రాయాన్ని ప్రకటిస్తారు లింగమూర్తి. అయితే కేవలం అభిప్రాయ ప్రకటనతో ఆగిపోకుండా ఆ ప్రకటనకు ఆధారాలను సైతం పేర్కొని, తన పరిశోధక ప్రవృత్తిని తేటతెల్లం చేస్తారు. ఇప్పుడక్కడి ప్రజలు కరణంగారి పొలంలోని గుండును భాస్కరరాయడు అనిచెప్పి గూడ పూజిస్తారు.

కానీ ఈ ఇద్దరిలో ఏ భాస్కరుడో వారు చెప్పలేక పోతున్నారు. అయితే రెండవ భాస్కరుడక్కడ ఆలయమే ప్రతిష్టించినాడు. కాబట్టి, అతని పేర గుండును పూజించ నవసరంలేదు. అందువల్ల అతడు మొదటి భాస్కరుడే అని నేను భావిస్తున్నాను. అభిప్రాయ ప్రకటనలో సూటిదనం, నిజాల వెల్లడిలో ఆధారాలను ఊతంగా చేసుకోవడం నిజమైన పరిశోధకుల లక్షణం. ఈ లక్షణం పుష్కలంగా ఉన్నవారు కాబట్టే లింగమూర్తి రచనలు నేటికీ జనరంజకంగా, విజ్ఞానదాయకంగా ఉన్నాయి.

లింగమూర్తి వ్యాసాల్లో మరో లక్షణం సంబంధితాంశానితో ముడిపడివున్న వృత్తాంతాలను వివరించడం. ఆయా వృత్తాంతాలను కథల్లాగా చెప్తారు ఆయన. అది పాఠకులను చాలా ఆకర్షిస్తుంది. చాలా వృత్తాంతాలను అరటిపండు ఒలిచినట్టు సూటిగా చెప్పినా కొన్నిసందర్భాల్లో విషయాన్ని నర్మగర్భంగా వెల్లడిం చడమూ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భానికి ఒక ఉదాహరణ ’సద్గురు కొడుమూరు చెన్నయ్యదాసు’ వ్యాసం. ఈ వ్యాసంలో గుల్బర్గాకు చెందిన శాంతప్ప అనే బ్యాంక్ సెక్రటరీ వృత్తాంతాన్ని వివరిస్తారు లింగమూర్తి.

క్షుద్ర ప్రయోగాలుచేసే కొందరు రెండు ముఠాలుగా ఏర్పడతారు. వారిలో ఒక ముఠా క్షుద్ర ప్రయోగాలు చేస్తే మరో ముఠా ఆ ప్రయోగాలను తగ్గిస్తామని, బాధితులనుండి డబ్బులు వసూలు చేసేవారు. తర్వాత ఆ రెండు ముఠాలు ఆ డబ్బును పంచుకుంటాయి. వారి దృష్టి శాంతప్పపై పడుతుంది. మొదటి ముఠా ప్రయోగాలుచేస్తే రెండో ముఠా శాంతప్పనుండి డబ్బును గుంజి, ఇంకా ఆశతో ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో శాంతప్ప సతీమణి చెన్నయ్యదాసు సహాయం అర్థిస్తుంది. చెన్నయ్యదాసు వారింటికి వెళ్తాడు. ‘ఇక్కడికి వచ్చినవాళ్లను పంపడానికే నేను ఇక్కడికి వచ్చాను’ అని దుండగులతో చెప్తాడు. బాధ ఎక్కువైనప్పుడు తనకు ఉత్తరం రాయవలసిందిగా శాంతప్ప సతీమణికి సూచిస్తాడు. అలాగే కొద్దికాలం తర్వాత దుండగుల బాధ తీవ్రమైనప్పుడు ఆమె ఆవేదనతో చెన్నయ్యదాసుకు లేఖ రాస్తుంది. ఈ బాధకు చెన్నయ్యదాసిచ్చిన ముగింపును లింగమూర్తి చెప్పిన తీరు బాగుంది.

అరుదైన అంశాలు.. విశేషాలు

‘అది వ్రాసిన వారం దినాలకు అక్కడి స్థానిక పత్రికలో గుల్బర్గా బస్టాండులో ఘోర ప్రమాదం. ఒక లారీ గుద్దుకొని ఏడుగురు సైకిలు మోటార్లపై ప్రయాణించేవారు దుర్మరణం చెందినారు అనే వార్తపడింది. ఇక్కడ ఆ ప్రమాదానికి- చెన్నయ్యదాసు ఇచ్చిన పరిష్కారానికి లంకె ఏమిటో నేరుగా చెప్పకపోవడం రచయిత ప్రతిభ. ఆ లంకెను పాఠకులే అనువర్తింపజేసుకోవాలి. పాఠకుల మేధకు ఇక్కడ రచయిత పని చెప్తున్నారు.

ఆ ప్రమాదంలో మరణించినవారు ఆ క్షుద్ర ప్రయోగాల ముఠా సభ్యులేనని, చెన్నయ్యదాసు ఆ విధంగా సమస్యను పరిష్కరించారని అర్థం చేసుకోవాలి. ఈ వ్యాఖ్యానాన్ని పాఠకుడికే వదిలివేస్తారు రచయిత. లింగమూర్తి వ్యాసాల ముగింపు ప్రత్యేకంగా ప్రస్తావించదగింది. ముగింపులో ఏదో ఒక విశేషముండేలా చూడడం ఆయన రచనాశైలి. ముగింపులో కొన్నిసార్లు సుప్రసిద్ధ వ్యక్తుల ప్రస్తావన ఉంటుంది. ’గుంటిపల్లిభాస్కరుడు’ వ్యాసం ఇలా ముగుస్తుంది.

జాషువా గారు ‘పొద్దునకు వన్నెబెట్టిన ఇద్దరు భాస్కరుల పుడమి నేలగ సొగసుల్ దిద్దినది మేననప్పుడు పెద్దది గుంటూరుసీమ పెరసీమలలో అని గుంటూరును గబ్బిలాలతో వర్ణించినాడు. అట్లాగే ఈ ఇద్దరు భాస్కరులుగూడ తమ కాలంలో మా పాలమూరు జిల్లాలో తమ ప్రొద్దుకు వన్నెబెట్టినారు. ఈ వాక్యాల్లో జాషువాను రచయిత ప్రస్తావించడం; జాషువా రచనకు, గుంటిపల్లి భాస్కరులకు మధ్య ఒక సంబంధాన్ని చెప్పడం కనిపిస్తుంది. ‘సద్గురు కొడుమూరుచెన్నయ్యదాసు’ వ్యాసాన్ని రచయిత ఇలా ముగిస్తారు.

ఈ రచనల పఠనం మధురస సేవనానుభూతిని కలిగిస్తుంది. లింగమూర్తివారసత్వాన్ని కొనసాగిస్తూ పాఠకలోకానికి దగ్గరయ్యారు కపిలవాయి అశోక్‌బాబు. గ్రంథానికి సంపాదక బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ కే కృష్ణమూర్తి అభినందనీయుడు. లింగమూర్తి శత జయంతి సంవత్సరం వస్తున్నది. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికలు, సదస్సుల రూపకల్పనకు ఇప్పటి నుంచే పూనుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే దిశగా రచయితలు, కవులు కృషిచేయాల్సిన తరుణమిదే !

 వ్యాసకర్త: దర్పణం సాహిత్య వేదిక 

 అధ్యక్షుడు, సెల్: 94410 46839