1 May, 2026 | 11:22 PM

రామగుండంలో థర్మల్ విద్యుత్తు కేంద్రం 800 మెగావాట్లతో..

26-06-2024 12:49 AM
  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన
  2. మంత్రులు దుద్దిళ్ల, పొన్నం, ఎమ్మెల్యేలకు స్పష్టంచేసిన డిప్యూటీ సీఎం
  3. సింగరేణి ఆధ్వర్యంలో పిట్‌హెడ్ ప్లాంట్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిచేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు పలువురు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంతో మాట్లాడుతూ.. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ స్టేషన్‌ను నిర్మించాలని, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న హామీని పూర్తి చేయాలని వారు కోరారు. ఇందుకు డిప్యూటీ సీఎం భట్టి సానుకూలంగా స్పందించారు.

సింగరేణి ఆధ్వర్యంలో..

నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మకమైన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌ను తిరిగి నిర్మిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. 800 మెగావాట్ల పిట్‌హెడ్ ప్లాంట్‌ను సింగరేని ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం స్పష్టంగా తెలిపారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, రాజ్ ఠాగూర్ సింగ్, విజయరమణారావు తదితరులున్నారు.