calender_icon.png 5 February, 2026 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవీంద్రుడు మారన

10-06-2024 01:17:50 AM

తెలుగులో వచ్చిన అనేకమంది కవులకు ఆధారమైన కథాంశాలకు మార్గదర్శకం ‘మార్కండేయ పురాణం’. దీనిని తొట్ట తొలిసారిగా తెలుగులో రచించడం ద్వారా తెలుగు సాహితీ ప్రపంచాన ‘మొట్టమొదటి తెలుగు పురాణకర్త’గా విఖ్యాతినందుకున్నాడు మారన మహాకవి. అప్పటి వరకు తెలుగులో ఇతిహాసాలు, కావ్యాలు వెలుగు చూశాయి. దేశీ పురాణాలు వెలువడ్డాయి. తొలిసారి సంస్కృతంలోని ఒక మహా పురాణాన్ని తెలుగులో రచించి, తదనంతర కాలంలో వెలువడ్డ గౌరన ‘హరిశ్చంద్రోపాఖ్యానా’నికి, శంకర కవి ‘హరిశ్చోంద్రోపాఖ్యానా’నికి, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’కు, ‘సవరం చిన నారాయణ ‘కువయలాశ్వ చరిత్ర’కు మూలమై నిలిచిన, ప్రథమాంధ్ర మహాపురాణం మారన ‘మార్కండేయ పురాణం’.

అంతేగాక, ప్రౌఢకవి మల్లన ‘రుక్మాంగద చరిత్రము’ వంటి కావ్యాల్లోని కొన్ని ప్రత్యేక వర్ణనలకు కూడా ఈ పురాణం దారి చూపింది. ఈ విషయాన్ని వావిళ్ల వారి ప్రచురణకు పీఠిక రాసిన శేషాద్రి రమణ కవులు తమ పీఠికలో స్పష్టంగా చెప్పారు. తెలుగు భాషలో పురాణ రచనకు శ్రీకారం చుట్టడమేగాక, దీనినొక రమ్యమైన కావ్యశైలీ సమన్వితంగా రచించడం మారన కవిత్వ ప్రతిభకు దర్పణం.

కాకతీయుల కాలం వాడు

2,547 గద్య పద్యాలున్న ఈ ‘మార్కండేయ పురాణాన్ని’ రచించిన మారన కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రుని కాలం వానిగా సాహిత్యకారులు నిర్ధారించారు. ఈ నిర్ధారణకు ముఖ్య కారణం కవి ఈ గ్రంథాన్ని ప్రతాపరుద్రుని సేనా నాయకుడైన ‘గన్నయ’కు అంకితమివ్వడమే. దీనినే ప్రధాన ఆధారంగా భావించారు. అందుకే, ఈయన కాలం 1295 మధ్య కాలంగా నిర్ణయించారు. అయితే, ప్రతాపరుద్రుడు పాలిస్తున్న కాకతీయరాజ్యంపై 1303, 1309, 1329 సంవత్సరాల్లో మహమ్మదీయుల దండయాత్రలు జరిగాయి. గ్రంథ స్వీకర్తయైన గన్నయ తప్పనిసరిగా సేనా నాయకునిగా ఈ యుద్ధాల్లో పాల్గొని ఉంటాడు. అయితే, ఈ గ్రంథంలో కృతిపతి వర్ణనలో ఎక్కడా ఈ అంశం ప్రస్తావింపబడలేదు. కనుక, ఈ రచన 1303కు పూర్వం రచించి ఉండవచ్చునని చారిత్రకుల భావన.

‘మార్కండేయ పురాణ’ కర్త మారన తన గ్రంథంలో ‘తాను తిక్కన శిష్యుడనని’ పేర్కొన్న కారణంగా ఈయన నెల్లూరు ప్రాంతానికి చెందినవాడుగా తొలుత భావించారు. కానీ, కొంత లోతైన కారణాలను అన్వేషించి, గ్రంథ స్వీకర్త కాకతీయుల సేనాని కాబట్టి, మారన నెల్లూరివాడు కాకపోవచ్చునని, ఆయన ఈ ప్రాంతానికి చెందిన వానిగా గుర్తించారు. ఆరుద్ర గారు ‘ఈ కవి గోదావరిని వర్ణించిన దానినిబట్టి, ఇతర ఆధారాల మేరకు’ ఈయన నివాసాన్ని నిర్ణయించే ప్రయత్నం చేశారు. 

తెలంగాణ ఆణిముత్యం 

సాధారణంగా కవులు తమ తమ ప్రాంతాలకు సంబంధించిన స్థలాలను, నదీనదాలను ఎక్కడో ఒకచోట సందర్భం వచ్చినప్పుడు వర్ణించడం సహజమే. అదే రీతిలో మారన కూడా “సురుచిరమగు సహ్య నగో త్తరమున విలసిల్లు చుండు దద్దయు గోదా వరి తత్ప్రదేశము మనో హరము పవిత్రము మునీంద్ర! యఖిల ధరిత్రిన్‌” అన్న పద్యాన్నిబట్టి ఈ కవి తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతం వాడై ఉండవచ్చునన్న ఆరుద్రగారి ఆలోచనను తరువాతి సాహిత్య చరిత్రకారులు అంగీకరించారు. తిక్కన మహాకవి ఓరుగల్లులో గణపతిదేవ చక్రవర్తిని సందర్శించినప్పుడు ఇక్కడ ఆయన శిష్యరికం చేసి ఉండవచ్చుననీ భావించారు. పైగా తిక్కన మహాకవిని ‘భారత సంహితా కవితా విభుడు’ అని ప్రస్తుతించిన దానినిబట్టి మారన రచన మహాభారత రచనానంతరమే జరిగిందని తెలిపారు. తాను ‘శ్రీమదుభయ కవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీ పాత్రు’డనని మారన చెప్పుకున్న దానినిబట్టి తిక్కన శిష్యరికం చేసి ఉంటాడని భావించారు.

ఆశ్చర్యపరిచే ప్రయోగాలు 

తెలుగులో తొలి పురాణానికి శ్రీకారం చుట్టిన మారన కవీంద్రునితో కాకతీయుల సేనానియైన గన్నయ ‘ప్రకాశిత సారకథామృతం బొగి ద్రావి జగజ్జనంబు లలరన్ వచియింపు తెనుంగునన్ వచః శ్రీవిభవంబు పెంపు విలసిల్లగ” అని పలికి ఈ రచనను తనకు అంకితమివ్వవలసిందిగా చేసిన అభ్యర్థనలో పేర్కొన్నట్లే ఈ పురాణం కావ్యశైలీ సమన్వితమై, రసనిర్భరమై, గొప్ప వచో వైభవంతో అలరారినట్లు మారన ‘మార్కండేయ పురాణం’ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 

ఈ గ్రంథంలో శబ్దాలంకారాల కన్నా అర్థాలంకార ప్రయోగాలే అధికంగా కనిపిస్తాయని సాహితీవేత్తలు అభిప్రాయ పడతారు. ఈయన ప్రయోగ ప్రతిభకు అచ్చెరువు పడ్డ అల్లసాని పెద్దన కవి ఈ పురాణంలోని కథను తన మూలకథగా స్వీకరించడమేగాక మారన ప్రయోగాలను కూడా ప్రతిబింబించే రీతిలో తన కావ్యంలో ప్రయోగాలు చేయడం విశేషం. తన రచనను అంకితంగా స్వీకరించిన గన్నయ సేనానిని పలు విధాలుగా ప్రశంసించడమేగాక ఆయనను ‘నీతియుగంధరుడ’ని కీర్తించారు.

‘ఎలమిన్ ప్రతాపరుద్ర మనుజేంద్రుని చేన్ బడసింబ్రవీణుడై గొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిన్ గీలుడంచియు బలరిపుతుల్య విక్రముడు, నాగయ గన్నవిభుండు తేజమున్ విలసిత రాజ్య చిహ్నములు, విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్’ నెఱపిన వానిగానూ ప్రశంసించాడు.

మార్గదర్శకాలైన మానవధర్మాలు

సాధారణంగా పురాణ గ్రంథాలలో పొందుపరచే అనేక ధర్మాలు ఈ ‘మార్కండేయ పురాణం’లోను పొందుపరుపబడ్డాయి. ఆ ధర్మపన్నాలతోపాటు వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధ నియమాలు, పురాతన వంశావళి వివరాలు వంటి అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. కొన్నికొన్ని పద్యాలు తదనంతర కవులకు మార్గదర్శనమయ్యాయి. మనకు ‘సుమతి శతకం’లోని ప్రసిద్ధ పద్యమైన 

‘అప్పిచ్చు వాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక బారు నేఱును..’ అన్న దానికి ఈ గ్రంథంలోని

‘ఎచ్చట శ్రోత్రియుడును, ధన

మిచ్చునతడు, నీరు గలుగు నేఱును, వెజ్జున్

మచ్చికయును లేకుండును

నచ్చట వసియింప వలవదభినుత చరితా!’ 

అన్న పద్యం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

నైతిక విలువకు పెద్దపీట

ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం గారు తమ పరిశోధనా గ్రంథమైన ‘ప్రథమాంధ్ర మహాపురాణము’లో మారన గ్రంథంలోని అనేక విశేషాలను వివరించారు. మారన కవీంద్రుడు తన రచనలో అనేక లోక ధర్మాలను, దాంపత్య ధర్మాన్ని, గార్హస్థ్య ధర్మాన్ని, సతీ ధర్మాన్ని చెప్పడమేగాక నైతిక విలువలను పెంచేలా వివిధ రీతులను కూడా బోధించినట్లు ఆయా సందర్భాలకు సంబంధించిన అనేక ప్రమాణాలతో వివరించాడు. దీనినిబట్టి మహాకవి మారనకు వున్న లోక శ్రేయస్సు, మానవ ధర్మావసర దృష్టి ఎంతటిదో మనం తెలుసుకోవచ్చు. మూలంలో చెప్పబడిన అనేక ధర్మాలను అతిసరళంగా తెలుగువారికి మారన ఈ గ్రంథం ద్వారా అందించాడు.

‘అపుత్రతా మనుష్యాణాం

శ్రేయసే న కుపుత్రతా

కుపుత్రో హృదయా యానం

సర్వదా కురుతే పితుః’

అంటూ ‘దుర్మార్గులైన పుత్రులు ఉండడం కన్నా పుత్రులు లేకున్నా మంచిదే’ అన్న మూల శ్లోకాన్ని మారన కవి

‘పుత్రుడు పుట్టమి మేలు కు

పుత్రుడు జన్మించుకంటె బురుషునకు దు

ష్పుత్రుడు దహించు నిజ చా

రిత్రాగ్నిని దండ్రి తండ్రి మనము రేయును బగలున్’

అంటూ అత్యంత సరళమైన పద్యంగా అనువదించి, ‘దుష్టుడైన పుత్రుని కలిగి ఉండటమంటే ఆ తండ్రిని రాత్రింబవళ్లు దహించి వేయడమే’ అవుతుందని వివరించాడు.

మారన చెప్పుకున్నట్టుగా ‘ఈ దివ్య పురాణ రత్నమును మా ర్కండేయమే జెప్పం గాంచితి, పుణ్యాత్ముడనైతి, జన్మము ఫలించెన్’ అన్నది అక్షర సత్యం. ఆయన పుణ్యాత్ముడు కావడమేగాక తెలుగు వారినందరినీ ధన్యాత్ములను చేశాడనీ చెప్పవచ్చు. దీనివల్ల ఆయన జన్మమే ఫలించడంతోపాటు తెలుగుజాతి వారి జన్మలూ ఫలించాయన్నది తిరుగులేని సత్యం.

వ్యాసకర్త సెల్: 9949013448