calender_icon.png 5 February, 2026 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరికోసం ఈ రచనా విధానం?

10-06-2024 01:12:19 AM

ఒక పర్యాయం హైదరాబాదులో ‘స్రవంతి’ పత్రిక రజతోత్సవం సందర్భంగా ఒక సాహిత్య గోష్ఠి జరుగుతున్నది. అందులో ఒక మిత్రుడు (కేతవరపు రామకోటిశాస్త్రి) ఒక పత్రం చదువుతూ ‘తెలుగుభాషకు ఓటమిగా, సంస్కృత భాషకు గెలుపుగా ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య భట్టు సంస్కృత శ్లోకంలో ప్రారంభించాడు’ అని విచిత్రమైన భావాన్ని ప్రకటించాడు. ఆయనకెప్పుడూ నూతన ప్రతిపాదనలు చేయటం ఇష్టం. అయితే, క్రీస్తుశకం వెయ్యి సంవత్సరాలకు కొంచెం ఇటూ అటుగా ఒక్క తమిళంలో తప్ప ఆధునిక భారతీయ భాషలలో సాహిత్యం ప్రారంభమయింది. అప్పటిదాకా సంస్కృత ప్రాకృతాలే రాజభాషలు. పండితాదరణం పొందిన భాషలు నన్నయ్యకు ఐదు వందల సంవత్సరాలనాడే తెలుగు శాసనాలు వెలువడటం ప్రారంభం అయింది. పద్యరచన అంతో యింతో ఉన్నది. క్రమంగా ఆ స్థానంలోకి తెలుగు ప్రాకి వస్తున్నది. ఈ పద్ధతిగా ఆలోచిస్తే నన్నయ్య భారత రచన తెలుగు భాషా సారస్వతాల విజయము. సంస్కృత శ్లోకం అలా మిగిలి పోవటం దాని నిష్క్రమణకు గుర్తు.

అయినా, భాషలు ఓడటం గెలవటం ఏమిటి? హేతు విరుద్ధం అయిన భావన ఇది. చర్చలో పాల్గొన్న నేను అడిగాను ‘గురజాడ అప్పారావు కన్యాశుల్కంలోని ఆంగ్ల భాషా బాహుళ్యం తెలుగు భాషకు ఓటమిగా, ఇంగ్లీషు భాష గెలుపుగా చెప్పవచ్చునా?’ అని. దానితో ఇబ్బంది పడిపోయి ఆయన తన ప్రతిపాదనను సర్ది చెప్పుకోలేక నానా అవస్థలు పడ్డాడు.

ఈ ప్రస్తావన తేవటానికి కారణం నేడు మన వ్యవహారంలో, టీవీల్లోని ప్రకటనల్లో, ముఖ్యంగా కొత్త కవిత్వంలో ఇంగ్లీషు వాడటం ఒక సునామీలాగా ఆక్రమించింది. ఉర్దూ అధికార భాషగా ఉన్న రోజుల్లో అధికార స్తరాల వారి కుటుంబంలో వారి వ్యవహారంలో ఉర్దూ శబ్దజాలం విపరీతంగా ప్రయోగింపబడింది. కాని, కాలం గడిచి పోయేప్పటికీ మళ్లీ ఆ శబ్దజాలం ప్రయోగంలో నుంచి తొలగిపోయింది. కాని, యిప్పుడు ‘మన అధికార భాష తెలుగు కాదా?’ అని అనుమానం కలుగుతున్నది.

‘నా డ్రీమ్ డ్రామాలో’ ‘నీ నగ్నరక్తం ఊజయి డ్రిపిల్ అయి’, ‘ఎదుటి మనిషి క్షేమంకై సిప్‌తో స్నేహంలో పఫ్‌తో’, ‘సైజ్‌కు మించిన డ్రెస్ కోలాహల ప్రపంచంలో డ్రాయింగ్ రూం కార్పెట్‌పై’ ఇలా ఎన్నైనా ఉదాహరిస్తూ పోవచ్చు. కొన్ని సందర్భాలలో కావ్యం పేరే ఇంగ్లీషుగా ఉంటున్నది. ‘సీజ్ ఫైర్’, ‘వర్తమానం స్క్రీన్‌పై’, మరొక చోట అధ్యాయాల పేర్లు....‘మ్యూజియం లోకి’, ‘కార్నివాల్‌లో’, ‘జైల్ కార్నర్’ మరొక చోట ఆంగ్ల కావ్యాల నుంచి పంక్తులు పంక్తులు ఉదహరించటం వైఖరి. ఇలా అనేకులైన కవుల రచనల నుంచి పేర్కొంటూ పోవచ్చు.

‘ఈ ఆంగ్లీకరణ ప్రక్రియ ప్రధాన ప్రయోజనం ఏమిటి?’ అని ప్రశ్నించుకుంటే రెండు కారణాలు కానవస్తాయి. ఆంగ్ల శబ్దజాల ప్రయోగ బాహుళ్యం ఆధునికతకు గుర్తు అనే ఒక భ్రాంతి. మన కవిత్వం ఎవరిని ఉద్దేశించి, ఏ భాషీయుల గురించి వ్రాస్తున్నామో వాళ్లను సరిగా గుర్తించలేక పోవటం లేదా వారిని పరిమితం చేసుకోవటం. స్వస్థాన వేష భాషాభిమతం తగ్గిపోయి, అనుభవానికీ చమత్కారానికీ నడుమ విభజన రేఖ గీసుకోలేక పోవటం. 20వ శతాబ్దం మధ్య భాగంలో మన దినపత్రికలు రోజూ టెలిప్రింటర్ మీద వచ్చే అంశాలను తెలుగు చేసే సందర్భంలో ఎన్నెన్ని కొత్తకొత్త పదాలను, పదబంధాలను సృష్టించాయో, అవి ఎంత వేగంగా ప్రజల వాడుకలోకి వచ్చాయో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దానివల్ల ఎంత సంపన్నమయింది మన భాషా వ్యవహారం! ఆధునిక జీవన ప్రతిఫలనం ఎంత బలంగా వాడుకలోకి వచ్చింది. ఈ రోజుల్లో మనం వాడే తెలుగులో సుమారు ముప్పయి శాతం పత్రికలవల్ల కొత్తగా భాషలోకి ప్రవేశించిన శబ్ద సందోహమేనంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పజిల్ అనకుండా ప్రహేళిక, గళ్ల నుడికట్టు ఎంత త్వరలో భాషలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఏ దినపత్రిక చూచినా జనరల్ స్టడీస్‌కు ప్రిపేర్ కావడం ఎలా? అప్‌గ్రేడేషన్ పరిష్కార మార్గం కాదు, ఫెయిల్యూర్ స్టోరీ, సండే పజిల్, ఇన్‌బాక్స్, సైన్స్ వాచ్, కవర్ స్టోరీ, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్, క్రైమ్‌టైమ్, హాపీ లైఫ్.... ఇలా పేజీల కొద్దీ పేర్కొనవచ్చు.

ఇది వ్యవహార భాష అని ఒక సమర్థన. ఎవరి వ్యవహారం? ఎవరి కోసం ఈ రచనా ప్రపంచం? ఎవరి జ్ఞాన విజ్ఞాన వికాసాలు మనకు లక్ష్యం?

మనం కిటికీలు తెరవాల్సిందే. అవసరమైన అన్యభాషా వ్యవహారాన్ని ఉపయోగించ వలసిందే. అయితే, గోడలు కూల్చేయటం మన హృదయ వైశాల్యాన్ని ప్రకటించుకునే పద్ధతి కాదు కదా! పి.వి. నరసింహారావు రాష్ట్ర విద్యామంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించిన ‘శ్వేత పత్రం’ మన భాషా సంపన్నతకు స్పష్టమైన హేతుబద్ధ విధానాన్ని ప్రకటించింది. తమిళ కర్ణాటక భాషా వ్యవహర్తల ధోరణిలో ఈ వైపరీత్యం ఉన్నట్లు లేదు. హిందీ బెంగాలీలకు ఈ గాలికి కొట్టుకుపోయే లక్షణం ఉండదు.

స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత పాతిక యేళ్లు భాషాభివృద్ధి కోసం ప్రయత్నం జరిగినట్లుగా తరువాత జరుగక పోవటమే కాదు, ఉన్న అభివృద్ధి కాస్త తిరోగమన దిశలో సాగిపోయింది. ఇందుకోసం ప్రధాన దోషం వాఙ్మయాన్ని, సాహిత్యాన్ని ఆవరించి పరిపాలిస్తున్న వాళ్లది. తరువాత నేరం పత్రికల వాళ్లది. అప్పుడు రాజకీయ వాదులూ, ఇతరులూ వస్తారు. అన్నమయ్య వాడిన శబ్దజాలం అంతా తోడుకోగలిగితే, పాల్కురికి సోమన్న శబ్దజాలం పునరుజ్జీవింపగలిగితే మనం ఎంతగా సంపన్నులం అవుతామో భాష విషయంలో ఆలోచించితే మనకే ఆశ్చర్యం కలుగుతుంది.

అనుభూతి విశేషాల ప్రకటను నూతన శాస్త్ర విజ్ఞాన సాంకేతిక సామగ్రిని చెప్పటం కోసం, ఇతర నాగరికతల సంస్కృతుల సంపర్కాన్ని వెల్లడించే సందర్భంలో పరభాషా వ్యవహారం అపరిహార్యం కాకపోవచ్చు. అయితే, ఆ సన్నివేశాలలోనూ మనం భాషా సంప్రదాయాల రీతిగా కొత్త పదాలను కల్పించుకునే ప్రయత్నమూ చేయవలసిందే. 

శబ్దం ఒక ఉపకరణం. దానికి నిర్దిష్టార్థాన్ని సంక్రమింపజేసేది మన వ్యవహారమే. వ్యవహారంలోకి వచ్చిన శబ్దం, లోకంలోకి వచ్చిన నూతన శిశువులా చైతన్య ప్రసారమవుతుంది. భాషా పరివారాన్ని విస్తృతం చేస్తుంది. భాషలో ఇముడని శబ్దాలు సజీవమైన ప్రత్యామ్నాయ పదసమూహం వాడుకలోకి రాగానే తనంత తానుగా తొలగిపోతవి.

మొన్న మా ఇంటికి బియ్యం వచ్చాయి. మా మనుమరాలు ‘అన్నం వచ్చింది... అన్నం వచ్చింది’ అంటున్నది. అంటే, రైస్ అని తన వ్యవహారం. బియ్యానికీ అన్నానికీ ఒకే మాట రైస్ కావటం వల్ల బియ్యాన్ని అన్నమనే అంటున్నది. ఇలా ఏ భాషకైనా ప్రత్యేకతలు ఉంటాయి. మనం రోడ్డు రోలర్‌లాగా వస్తున్న ఇంగ్లీషు వ్యవహారాన్ని స్వాయత్తీకరించుకోవటం వలన ఇలాంటి కష్టాలెన్నో పొందవలసి ఉంటుంది.

ఇంచుమించుగా యాభై యేళ్ల క్రితం మా మిత్రుడు ‘ఆంధ్రావతరణం’ అనే కావ్య సంకలనంలో వ్రాసిన పద్యాలను చూచి సమీక్షకుడు ‘దానిలో సంస్కృత బాహుళ్యం పెరిగింది. ఇలా అయితే సంస్కృతంలోనే వ్రాయవచ్చు కదా’ అన్నాడు. వ్రాసినా, చదివినా, ఉపన్యసించినా, మాట్లాడినా, అవసరమైతే తప్ప ఇంగ్లీషు భాషా శబ్దజాలాన్ని వాడకుండా వ్యవహరించటం అలవాటు చేసుకుంటే పదేళ్లలో మనం అనేకానేక నూతన భావ సౌకుమార్యం గల, ప్రకాశన గాంభీర్యం గల, జీవన గాఢతను చెప్పగల ఆధునిక జీవన ప్రసారకంగా తెలుగు భాషను రూపొందించుకోవచ్చు. భాషా ప్రయుక్త రాష్ట్రోద్యమం వచ్చిందే ప్రజాస్వామ్యానికి మూలమైన ప్రజల భాషలో. పరిపాలన సాగించటం లక్ష్యంగా, పాలితులకూ, పాలకులకూ దూరం సన్నగించేందుకు కాని, నాగరీకరణం పొందిన పరభాషా ప్రభావ భావ వాహుల కోసం కాదు. ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా!’ అన్న ప్రజాకవిని స్మరిద్దాం.