11-06-2024 12:00:00 AM
రాష్ట్రంలోని హోం గార్డుల దయనీయ పరిస్థితిపై ‘విజయక్రాంతి’ సోమవారం ప్రచురించిన వార్తా కథనం అత్యంత బాధాకరం. పోలీసులతో సమానంగా విధులను నిర్వహిస్తూ కూడా వారికి వర్తించే ప్రయోజనాలను పొందలేకపోవడం అన్యాయం. ఇటీవలి ఎన్నికల అలవెన్సులు సైతం వారికి ముట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2018లోనే గత బీఆరెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పోలీసులతో సమానంగా వీరికి కూడా యూనిఫామ్ అలవెన్సులూ ఇవ్వక పోవడం అన్యాయం.
గతంలో సబ్సిడీ క్యాంటీన్లలో తక్కువ ధరకు సరుకులు కొనుగోలు చేసే సదుపాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే ఎలా? ఎండనక, వాననక ట్రాఫిక్ డ్యూటీల్లోనే ఎక్కువగా విధులు నిర్వహించే హోం గార్డుల సమస్యలను ప్రభుత్వం మానవతా దృష్టితో వెంటనే పరిష్కరించాలి. అప్పుడే, ఎందుకీ ఉద్యోగాలలోకి వచ్చామా అని వారు బాధపడే పరిస్థితి ఏర్పడకుండా ఉంటుంది.విధుల్లో వుండగా మరణించిన హోం గార్డు స్థానంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పించగలగాలి. పోలీసుల మాదిరిగా కనీసం ఉద్యోగ, ఆరోగ్య భద్రత కూడా వీరికి అవసరం.
అశ్వినీకుమార్, వరంగల్