calender_icon.png 5 February, 2026 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఓటేయండి

05-02-2026 01:28:14 AM

  1. ప్రతి మునిసిపాలిటీ గడ్డ.. కాంగ్రెస్ అడ్డాగా మారాలి
  2. పేదల సంక్షేమం కోసం అనేక పథకాల అమలు                  
  3. ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
  4. నల్లగొండ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టినవే
  5. మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 మంది ఫోన్ ఇనేటోడు మనిషేనా?

పెండ్లాం మొగుడు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు కూడా వినేటోడు మనిషేనా? అన్నం తినేటోడు ఇటువంటి వాటికి పాల్పడతాడా? అటువంటి వాళ్లకు నోటీసిస్తే జాతిపితకు నోటీసు ఇస్తారా అనడం సిగ్గుచేటు. ఎవరిది ఏ జాతి.. వినోద్‌రావు, దయాకర్‌రావు, కృష్ణారావు, హరీష్‌రావులు నీ జాతా. నల్లగొండకు, పాలమూరుకు నీ జాతితో అవసరమే లేదు. నీ జాతి, నీతుల గురించి మాకు తెలవదు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అంటే.. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్, ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కూడా తెలంగాణ ప్రజలదేనా?                     

సీఎం రేవంత్‌రెడ్డి

సూర్యాపేట, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : రెండు సంవత్సరాలలో ప్రజా ప్రభుత్వం పేదల కోసం, ఆదివాసీల కోసం, బలహీనవర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, అమలు చేసిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.

కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో లక్షలాదిమందికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు 3.17 కోట్ల మందికి సన్న బియ్యం.. ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అందించిన రేషన్ బియ్యం రైస్ మిల్లర్లకు అమ్ముకోవడం, బర్రెలకు దాణాగా పెట్టడానికి పనికొచ్చేవని, పేదలు ఏనాడైనా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యంతో తిన్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

కానీ, ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం చంటి బిడ్డలకు కడుపు నింపుతున్నదన్నారు. ఆ సన్న బియ్యం తింటున్న అక్కలు, అన్నలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గూడూరులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

రాష్ట్రంలోని ప్రతి మునిసిపాలిటీ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారాలని ముఖ్యమంత్రి అన్నారు. మిర్యాలగూడలో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. మరో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తామన్నారు. 

రైస్ బౌల్ ఆఫ్ మిర్యాలగూడ 

మిర్యాలగూడకు ఆసియా ఖండంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాం చి అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతమైందన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో అధు నాతనమైన మిల్లులు ఉండడం వల్లనే ప్రతి ఎకరాలో వరి ధాన్యం పండించగలుగుతున్నారన్నారు. నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతులను వరి వేసుకోవద్దని.. వరి వేసుకుంటే ఉరేనని చెప్పారన్నారు. వరివేస్తే ధాన్యాన్ని ప్రభుత్వం కొనదని, ప్రభుత్వం వ్యాపారాలు చేయదని చెప్పారన్నారు.

కానీ ఈ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరినీ వరి ధాన్యం పండించమని ప్రోత్సహించడంతోపాటు క్వింటాకు 500 రూపాయల బోనస్‌ను అందిస్తున్నదన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ 25.35 లక్షల మందికి 21 వేలకోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పులను విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున 9 వేల కోట్ల రూపాయలు ౯ రోజుల్లోనే రైతుల ఖాతాల్లో వేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. 

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రంలో 25 లక్షలు కట్టించామన్నారు. కానీ కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి, మాట మరిచి వెయ్యి ఎకరాలలో ఫార్మ్ హౌస్, పంజాగుట్ట చౌరస్తాలో పది ఎకరాలలో గడీలు నిర్మించుకున్నాడన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు నిర్మించిన ఇప్పటికీ 20 లక్షల ఇండ్లు వస్తుండే అన్నారు.

నల్లగొండ జిల్లాలో కట్టిన నాగార్జునసాగర్, వెల్లంపల్లి ప్రాజెక్టులైనా ధర్మారెడ్డి కాల్వ పిన్నాయి పాలెం కాల్వ, ఏఎమ్‌ఆర్, ఎస్‌ఎల్బీసీ.. ఏది అయినా కాంగ్రెస్ పార్టీ కట్టినవే అన్నారు. కోమటిరెడ్డి కొట్లాడి తెచ్చిన ఎస్‌ఎల్బీసీ 30 కిలోమీటర్లు టన్నెల్ ఉమ్మడి రాష్ట్రంలో తవ్వితే, 10 ఏళ్లు అధికారంలో ఉండి  సంవత్సరానికి 1 కిలోమీటర్ తవ్వినా ఎస్‌ఎల్బీసీ పూర్తి అయ్యేదన్నారు. 3.60 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదన్నారు. నల్లగొండ జిల్లా మీద కోపం పెట్టుకొని, కడుపులో విషంపెట్టుకొని ఎస్‌ఎల్బీసీ పనులు కాకుండా నిలిపివేశారన్నారు. 

మంది ఫోన్ ఇనేటోడు మనిషేనా?   

బీఆర్‌ఎస్‌లో పెండ్లాం మొగుడు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు కూడా విన్న సిగ్గులేని వాళ్ళు ఉండడం బాధాకరమన్నారు. జడ్జిలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులను, ఆఖరికి పెళ్ళాం మొగుళ్లను జోలిని వదల్లేదన్నారు. చివరికి సినిమా తారలను కూడా వదలలేదన్నారు. మంది ఫోన్ వినేటోడు మనిషేనా అని ప్రశ్నించారు. అన్నం తినేటోడు ఇటువంటి వాటికి పాల్పడతాడా? అని ప్రశ్నించారు. ‘అటువంటి వాళ్లకు నోటీసిస్తే జాతిపితకు నోటీసు ఇస్తారా అనడం సిగ్గుచేటు. ఎవరిది ఏ జాతి.. వినోద్‌రావు, దయాకర్‌రావు, కృష్ణారావు, హరీష్‌రావులు నీ జాతా.

నల్లగొండకు, పాలమూరుకు నీ జాతితో అవసరమే లేదు. నీ జాతి, నీతుల గురించి మాకు తెలవదు. ఇంతటి అఘాయిత్యాలకు పాల్పడ్డ వారిని జాతిపిత అనడం సరికాదు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అంటే.. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్, ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కూడా తెలం గాణ ప్రజలదేనా’ అని సీఎం ప్రశ్నించారు. ‘మీకున్న టీవీలు, పేపర్లు తెలంగాణ సమాజానికి ఇస్తావా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి పదవులన్నీ మీరే తీసుకొని తెలంగాణ ప్రజలకు ఏమిచ్చారు.

తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఎక్కడుందో తెల్వదు. ఆమెకు కూడా కనీసం ఒక బాధ్యత ఇవ్వని నీవు జాతిపిత ఎట్లా అయితవు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన జయశంకర్ జాతిపితైతడు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితది. చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.

భాస్కరరావు మోసగాడు.. 

మిర్యాలగూడలో ఉన్న నక్కజిత్తుల భాస్కరరావు జానారెడ్డి చెప్పులు పోశాడని, నీళ్ల సీసాలు మోసాడని, అందుకు విశ్వాసంతో తన కొడుకులను కాదని జానారెడ్డి టికెట్ ఇస్తే ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ కాళ్ళ వద్ద తాకట్టు పెట్టాడని రేవంత్‌రెడ్డి అన్నారు. అటువంటి ఆయన ఇవాళ నామినేషన్ వేసిన కాంగ్రెస్ వాళ్ళని బెదిరిస్తే చింతపండు అయితదని బెదిరించారు. ఇలాగే చేస్తే ఖమ్మం పోవాల్సి వస్తుందన్నారు.

నాగార్జునసాగర్ ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించేందుకు ఆయన ప్రయత్నించాడన్నారు. నల్లగొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలతోపాటు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రెండేళ్ల కాలంలో 17,472 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నల్లగొండ జిల్లా మున్సిపాలిటీలకు 2,028 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి 298 కోట్లు నిధులు మంజూరు చేసినమన్నారు.

భవిష్యత్తులో వేలకోట్ల రూపాయలతో మునిసిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీఎం మాటిచ్చారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో అక్రమ కేసులు: ఉత్తమ్ 

బీఆర్‌ఎస్ పరిపాలనలో అప్పటి ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు.  స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలోనే 85 శాతం మంది ప్రజలకి నాణ్యతతో ఆరు కిలోల సన్న బియ్యం తమ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తే, కాంగ్రెస్ వచ్చాక 1.75 లక్షల మంది రైతుల నుంచి 12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో రూ.1,750 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,943 కోట్లు రైతులకు చెల్లించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నెల్లికల్ లిఫ్ట్, తోపుచర్ల, దున్నపోతుల లిఫ్ట్  పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.  ఏడాది లోపు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. కృష్ణ, గోదావరి జలాల నీటి హక్కులపై పోరాటం చేస్తున్నామన్నారు.