గుంపు మేస్త్రీ హఠావో.. తెలంగాణ బచావో
సెంట్రింగ్ సమస్యలు పరిష్కరించకుంటే ధర్నా చేస్తా
తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత
ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి): తెలంగాణలో గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే ‘గుంపు మేస్త్రి హటావో తెలంగాణ బచావో’ నినాదం ఇస్తున్నా అని చెప్పారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు దిగిన సెంట్రింగ్ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు.
లేదంటే వారితో పాటు సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్ని రోజులైనా తాను కూడా ధర్నాలో కూర్చుంటానని స్పష్టం చేశారు. 12 డిమాండ్లతో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టిన సెంట్రింగ్ కార్మికులకు శనివారం కవిత మద్దతు తెలిపారు. ధర్నా శిబిరం వద్దకు వెళ్లి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర మరువలేనిదని, అద్దాల మేడల వెనుక వీరి కృషి దాగి ఉందని, ఈఎస్‌ఐ కార్డులు, స్కేర్ ఫీట్‌కు రూ. 51 కూలీ, కార్మికులు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ. 20 లక్షల పరిహారం, 20 డిమాండ్లతో చేపట్టిన ధర్నా సహేతుకమైనదేనన్నారు. సెంట్రింగ్ కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు.
గుంపు మేస్త్రీ సీఎం అయ్యాక హైడ్రా పేరుతో నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చేస్తున్నారని, దీంతో సెంట్రింగ్ వాళ్లు కూడా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రక్షణ సేన అధికాంలోకి వచ్చాక సెంట్రింగ్ కార్మికులు, యాజమాన్యాలు అడిగిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో 86 చోట్ల వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలం ఇస్తామని అన్నారు. ప్రతి మండలంలో కూడా సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సిన అవసరముందని కల్వకుంట్ల కవిత అభిప్రాయం వ్యక్తంచేశారు.






