24 May, 2026 | 12:29 AM

ఈ కాలభైరవుడిని పట్టించుకోరా?

24-05-2026 12:00 AM

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామ శివారులో ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న త్రిపుర భైరవీ సమేత కాలభైరవ స్వామి క్షేత్రం వేలాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. కాశీ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాడో అదే విధంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు బయన్నగుట్ట కాలభైరవుడు ఆధ్యాత్మిక ఆధారంగా, క్షేత్రపాలకుడిగా విశేష భక్తి గౌరవాలను అందుకుంటున్నాడు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం నేడు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై కనీస సౌకర్యాలు లేక వెలవెలబోతోంది.

రాణి రుద్రమదేవి కాలం నాటి చారిత్రక నేపథ్యాన్ని మోస్తున్న ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే సుమారు ఒక కిలోమీటర్ మేర ప్రమాదకరమైన కొండదారిలో ప్రయాణించాల్సి వస్తోంది. ఎత్తున రాళ్లు, ముళ్ల పొదలు, జారుడు బండల మధ్య నడుస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అడుగు తప్పి తే లోయలో పడే ప్రమాదం ఉన్నా కనీస రక్షణ చర్యలు లేకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. 

దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులు మారి నా, ప్రభుత్వాలు మారినా ఈ క్షేత్ర అభివృద్ధి మాత్రం మాటలకే పరిమితమైంది. ఆధ్యాత్మిక విశ్వాసంగా నిలిచిన కాలభైరవ క్షేత్రానికి కనీస దారి కూడా వేయలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నాగారం గ్రామానికి చెందిన కుండలిని సాధకుడు, భైరవ ఉపాసకుడు బ్రహ్మశ్రీ పోలోజు శ్రీకాంతాచార్య తన శిష్యబృందంతో కలిసి ఈ క్షేత్రానికి కొత్త ఊపిరి పోస్తున్నారు. అడవిలా మారిన పరిసరాలను శుభ్రం చేయించ డం, నిత్య దూపదీప నైవేద్యాలు నిర్వహించడం, ప్రత్యేక పూజలు చేపట్టడం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపుతున్నారు. ప్రతి అష్టమి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో యజ్ఞాలు, హోమాలు, నవగ్రహ శాంతి పూజలు, భైరవారాధనలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

అధిక జ్యేష్ఠ మాస అష్టమి సందర్భంగా నేడు కాలభైరవ క్షేత్రంలో త్రికోణ హోమగుండంలో అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, పంచబ్రహ్మల ఆవాహనతో విశేష యజ్ఞహోమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు హుస్నాబాద్ పరిసర ప్రాం తాలతో పాటు సుదూర హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, మహారాష్ట్ర, కర్ణాట క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేలాది మంది భక్తులు వస్తున్నా తాగునీరు, విద్యుత్, విశ్రాంతి కేంద్రాలు, రక్షణ గోడలు, మెట్లు, రహదారి వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. 

 కందారపు రమేశాచార్యులు (హుస్నాబాద్, విజయక్రాంతి)