21-01-2026 01:43:12 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే జరుగనున్న మున్నిపల్ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతిని మారలేదని, అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.
అయితే ఈ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసి మద్దతు కోరితే ఇస్తామని, అవసరమైన చోట తనతో పాటు జాగృతి నేతలు ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత స్పందించారు. ఈ కేసు ఇప్పుడే తుదిదశకు చేరుతుందన్న నమ్మకం తనకు లేదని, తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదన్నారు. కావాలనే బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిందని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలని, అందులో ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం కూడా పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.