బీఆర్‌ఎస్ భూకబ్జాలపై కవిత మాట్లాడాలి
- మా ప్రభుత్వం భూములను రక్షిస్తోంది
- ఇప్పటీ వరకు రూ. 50 వేల కోట్ల భూములను హైడ్రా కాపాడింది
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): కేసీఆర్ పాలనలో జరిగిన భూ కబ్జాల గురించి కవిత మాట్లాడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలో లక్ష కోట్ల భూదోపిడీ జరిగిందని కవిత అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆది సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో అవినీతికి కిటికీలు తెరిచాయన్న కవిత, అందులో ఆమె వాటా ఎంతో తెలంగాణ ప్రజలకు వివరించాలన్నారు.
కేసీఆర్ ఫామ్ హౌస్, జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్, హరీష్‌రావు, సంతోష్‌రావు ఫామ్ హౌస్‌లలో ఉన్న భూములపై కవిత మాట్లాడాలని ఆది డిమాండ్ చేశారు. కబ్జాల కోరల్లో చిక్కిన చెరువులను, ప్రభుత్వ భూములను మా ప్రభుత్వం కాపాడుతోందని, ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత అభినందిం చాలన్నారు.
రేవంత్ రెడ్డి సోదరుల పై కవిత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీఎం సోదరులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? అనవసర ఆరోపణలు చేస్తే మర్యాద దక్కదని ఆయన హెచ్చరించారు. కోడికుంట్ల చెరువులో పవన్ కళ్యాణ్ 10 ఎకరాల శిఖం భూములున్నాయని కవిత అంటోందని, ఆ భూములపైన కవిత ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రైతులకు మరణశాసనం రాసిన కేసీఆర్, హరీష్‌రావు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమన్నారు. తుమ్మిడిహట్టి పైన మహరాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించేలా బీజేపీ ప్రజాప్రతినిధులు చొరవ చూపించాలన్నారు.






