19-07-2025 04:53:36 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైలు మౌలిక సదుపాయాలను మార్చే ప్రధాన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా జరుగుతున్న కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RMU) పురోగతిని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించి, శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ నుండి కాజీపేటకు రైలులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో వెళ్లారు.
ఈ సంరద్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటం ఫలితంగా ఏర్పడిందని వ్యాఖ్యానించారు.పీవీ నరసింహారావు కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించారని, ఇక్కడ రైల్వే వ్యాగన్లు, కోచ్ లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేసినందుకు మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, వరంగల్ కు విమానాశ్రయం కూడా ఇప్పటికే రావాల్సి ఉందన్నారు. ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వాలని గతంలో మాజీ సీఎం కేసీఆర్ ను ఎన్నోసార్లు అడిగామన్నారు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా భూసేకరణ గురించి అడుగుతున్నామని చెప్పారు.