కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్
క్రీడా మైదానాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
గెలిచిన జట్టుకు 2 లక్షల నగదు బహుమతి
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): క్రీడల ద్వారా యువతలో నైపుణ్యాన్ని వెలికితీయాలనే సంకల్పంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం ఇస్లాం నగర్‌లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో 'కేసీఆర్ కప్' క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి అన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదేశాల మేరకు ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మ్యాకల రవి మాట్లాడుతూ... క్రీడాకారుల సౌకర్యార్థం క్రికెట్ గ్రౌండ్‌ను చదును చేసి అన్ని హంగులతో సిద్ధం చేసినట్లు తెలిపారు.
కేవలం రాజకీయాలే కాకుండా, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, ఎంపీటీసీ పరిధి నుంచి ఒక టీమ్‌ను ఎంపిక చేసి ఈ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. మండల స్థాయిలో విజేతగా నిలిచిన జట్టుకు 50,000 రూపాయల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు 25,000 రూపాయల నగదు బహుమతి అందజేయనున్నారు. మండల స్థాయిలో గెలిచిన జట్లు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటాయని, అక్కడ విజేతగా నిలిచిన టీమ్‌కు 2 లక్షల రూపాయలు, రన్నరప్ టీమ్‌కు 1 లక్ష రూపాయల భారీ బహుమతులను కేటీఆర్ అలాగే లక్ష్మీనరసింహారావు చేతుల మీదుగా అందజేస్తామని వివరించారు.
ఈ పోటీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వంటి ఇతర ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయని తెలిపారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆర్ సి రావు, సర్పంచ్ లు ఊరడి రాజిరెడ్డి, రెడ్డవేణి పరశురాములు, గొట్ల కుమార్, నాయకులు రంగు రాములు , వాసాల శ్రీనివాస్, కొండపల్లి వేంకట రమణారావు, బండారి శ్రీనివాస్, సందీప్ తో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




