26 June, 2026 | 1:10 PM

త్యాగానికి ప్రతీక మొహర్రం: మాజీ సీఎం కేసీఆర్

26-06-2026 11:56 AM

హైదరాబాద్: ​ధర్మం, సత్యం, త్యాగానికి ప్రతీకగా మొహర్రం(Muharram greetings) నిలుస్తుందని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(Kalvakuntla Chandrashekar Rao) పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలను స్మరించుకుంటూ ముస్లిం సహోదరులు మొహర్రంను జరుపుకుంటారని తెలిపారు. పీరీల పండుగ పేరుతో తెలంగాణ ప్రజలు సహోదర భావంతో, కులమతాలకు అతీతంగా పాల్గొంటారని వెల్లడించారు.

​ఉత్సాహం, విషాదం కలగలిపి దూలలాడుతూ, నిప్పుల గుండం మీద నడుస్తూ, మత సామరస్యాన్ని చాటుతూ పల్లె నుండి పట్నం దాకా సాగే పీరీల వేడుక, గంగా జమున సంస్కృతికి అద్దం పడుతుందని మాజీ సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో లౌకికవాదానికి గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని KCR ప్రార్థించారు. ​మైనారిటీల సంక్షేమం కోసం BRS పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ పునరుద్ఘాటించారు.