1 September, 2026 | 10:12 PM

Breaking News

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •  

విచారణ జాబితాలో కేసీఆర్, హరీశ్‌రావు

21-12-2024 | 12:49am

కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే సాగునీటి ఇంజనీర్లు, అధికారులు, ఐఏఎస్‌లు, నిపుణులు, వివిధ రంగాలకు చెందిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. శనివారం నుంచి ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న గుత్తేదార్లను కూడా విచారణకు పిలవనున్నట్లు సమాచారం.

గుత్తేదార్ల విచారణ జనవరి లోపు పూర్తిచేసి ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును సైతం కమిషన్ విచారిస్తుందని తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో రాజకీయ నాయకుల పాత్ర అంటూ ఉంటే వీరద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు విచారణలో పలువురు వీరి పేర్లను కమిషన్‌కు తెలిపారు.

వీరిని విచారించడం తప్పనిసరి అంటూ కొందరు సాగునీటి రంగ నిపుణులు సైతం చెబుతున్నారు. మరోవైపు వీరిద్దరిని పిలవకముందే పూర్తి విచారణ చేసి సిద్ధంగా ఉండాలని కమిషన్ ఆలోచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని రకాల నివేదికలను కమిషన్ ఇప్పటికే పరిశీలించినట్లు తెలుస్తోంది.

కాగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా ఆయన విదేశాలకు వెళ్లినందున ఆయన కమిషన్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. కాంట్రాక్టర్లు, రామకృష్ణారావు విచారణ పూర్తయ్యాక మిగిలేది కేసీఆర్, హరీశ్‌రావు విచారణ అని తెలుస్తోంది.

కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పెంపు...

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోసారి పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 14న ఏర్పాటైన కమిషన్ గడువును ఇప్పటికే పలుమార్లు పెంచుతూ వచ్చిన ప్రభుత్వం మరోసారి పెంచనుందని సమాచారం. ఇప్పటికే పెంచిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది.

అయితే క్రిస్మస్ సెలవులు ఉన్నందున దాదాపు ఈ నెల 23 నుంచి నెలాఖరు వరకు కమిషన్ విచారణ జరిగే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఇంకా కాంట్రాక్టర్లు, ముఖ్యులను విచారించాల్సి ఉండటంతో పాటు పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు సమయం సరిపోయే అవకాశం లేదు. కాబట్టి కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పెంచే అవకాశం కనిపిస్తోంది.