9 April, 2026 | 5:33 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

తెలంగాణను భ్రష్టుపట్టించింది కేసీఆరే

07-05-2024 01:51 AM

ఓడిపోయాక అవినీతి, కుంభకోణాలు వెలుగులోకి

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరా

కాంగ్రెస్‌తోనే మాల సామాజిక వర్గానికి న్యాయం

స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్, మే 6 (విజయక్రాంతి): తెలంగాణను భ్రష్టుపట్టించింది కేసీఆర్.. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుని ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాంపూర్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించడంతోపాటు హనుమకొండలో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఓడిపోయిన తర్వాత రోజుకో కుంభకోణం, అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడడమే కాకుండా ఫోన్‌ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు.

నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను కాంగ్రెస్‌లో చేరానని స్పష్టంచేశారు. పదేండ్ల పాలనలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. బీజేపీకి తెలంగాణ అన్నా, పేదలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నా గిట్టదని, అది ఒక మనువాద పార్టీ అని ధ్వజమెత్తారు. మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇబ్బందులకు గురి చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నదని మండిపడ్డారు. పేదల బంగారు భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. నరేంద్రమోదీ పాలనలో రాజ్యాంగం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నాయని, మాలలకు న్యాయం జరుగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగం తీసుకురావాలని బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. మళ్లీ బీజేపీ వస్తే భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మత విద్వేషాలు రెచ్చ గొడుతూ బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, భవిష్యత్తును మార్చబోతున్నాయన్నారు. పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కావ్య మాట్లాడుతూ.. ప్రజలకు స్వేచ్ఛ, రిజర్వేషన్‌లు ఉండాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలనన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి దాల్వీ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి,  కేఆర్ నాగరాజుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.