విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరగలేదు
ఎలాంటి విచారణకైనా సిద్ధం
ప్రభుత్వానికి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి) ః విద్యుత్ కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఈవిషయంలో ఏ విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్య, తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వ సందేహాలకు అసెంబ్లీలోనే సమాధానం చెప్పామని, శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామన్నారు. అయినా విచారణకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందని, కమిషన్ సందేహాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. పవర్ కమిషన్ ఉద్దేశం మరో విధానంగా ఉందని, వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తోందన్నారు.
చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం అన్ని ప్రభుత్వ రంగంలోని సంస్థలతోనే ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. ఏమైనా అవినీతి జరిగితే కేంద్రం నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించామని తెలిపారు. నేటి వరకు రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆర్టీపీసీ నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఇఎల్‌కు పవర్ ప్లాంట్ల నిర్మాణాలు అప్పగించామని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం ఈప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.






