దంచికొట్టిన వాన
- విరిగిపడ్డ చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
సహాయక చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి)/నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన ప్రజలను వణికించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 వరకు వర్షం కురవగా.. తిరిగి 6 గంటల నుంచి రాత్రి వరకు మరోమారు కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, ఈఎస్‌ఐ, యూసుఫ్‌గూడ, బోరబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమ య్యాయి.
అదే విధంగా శేరిలింగంపల్లి, రాయదుర్గం, మియాపూర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్, ఇందిరాపార్క్ సమీపంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షానికి నగరవ్యాప్తంగా పలుచోట్ల చెట్లు విరిగిపడడం, రహదారులపై వరద నీరు నిలవడం తదితర సమస్యలపై జీహెచ్‌ఎంసీకి 23 ఫిర్యాదులు అందాయి.
మూగజీవాలు మృత్యువాత..
పిడుగుపడి రాజన్న సిరిసిల్ల జిల్లా అచ్చన్నపేటకు చెందిన రైతు కల్లూరి లచ్చయ్యకు చెందిన రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. అలాగే నిర్మల్ జిల్లా కడెం మండలం అంబరిపేటలోనూ పిడుగుపడి 5 మేకలు, ఒక గొర్రె మృత్యువాత పడ్డాయి.






