27 March, 2026 | 4:51 PM

తన గురువు మరణం పట్ల కేసీఆర్ సంతాపం

27-03-2026 02:48 PM

హైదరాబాద్: తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి రమణయ్య మరణం పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.

రమణయ్య(Dr Jaisetti Ramanaiah passes away) సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా డా. జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా గుర్తింపు పొందారు. సౌత్ ఇండియా టెంపుల్స్ అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు.  డా. జైశెట్టి రమణయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.