23 April, 2026 | 1:22 AM

తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు

23-04-2026 12:00 AM
  1.   51 క్వింటాళ్ల పూలతో అలంకరణ
  2. హెలికాఫ్టర్ నుంచి పూలవర్షం
  3. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ పూజలు

డెహ్రాడూన్, ఏప్రిల్ ౨౨: ఉత్తరాఖండ్‌లోని ఎత్తున హిమగిరుల మధ్య ప్రకృతి రమణీయ ప్రదేశంలోని కేదార్‌నాథ్ ఆలయం తిరిగి తెరచుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత కేదారేశ్వరుడు తిరిగి భక్తులకు దర్శనమిచ్చేందుకు కొలువుదీరాడు. ఆలయ ప్రధాన అర్చకులు, పండితుల శంఖానాదాలు, మంత్రోచ్ఛారణ, ‘హర హర మహదేవ్’ అన్న భక్తుల ఘోష, నడుమ బుధవారం ఉదయం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.

ఆలయ నిర్వాహకులు, అర్చకులు 51 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. గగనతలం నుంచి హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు కేదారేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. ఉత్తరాఖండ్ పభుత్వం ఆలయ పరిసరాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నది. భక్తులు మొబైల్స్, కెమెరాలు, డ్రోన్ల వినియోగించడం నిషేధం. గర్భాలయం లేదా ప్రాంగణంలో రీల్స్  నిషిద్ధం. 

ఐక్యతకు ప్రతీక చార్‌ధామ్: మోదీ

కేదార్‌నాథ్ పునఃదర్శనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌మీడియా ద్వారా భక్తులకు సందేశమిచ్చారు. చార్‌ధామ్ యాత్ర భారతీయ సంస్కృతికి, ఐక్యతకు ప్రతీక అని అభివర్ణించారు.