డిసెంబర్ 10, 11 తేదీలలో కేరళ సంఘీభావ సభలు..
కేరళ ప్రజల హక్కులను రక్షించండి
వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయండి..
పోస్టర్ ఆవిష్కరణలో రైతు, సిఐటియు, వ్యకాస నాయకులు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): కేరళ ప్రజల హక్కులను రక్షించండి, వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా డిసెంబర్ 10, 11 తేదీలలో కేరళ సంఘీభావ సభలు, సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం హైదారాబాద్ లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో కేరళ సంఘీభావ దినం సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేరళ ప్రజల హక్కులను అణిచివేసేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార, నిరంకుశ చర్యలను తిప్పికొట్టాలని అన్నారు. చట్టబద్ధమైన నిధులు, రుణాలు తీసుకోవడానికి అనుమతి నిరాకరించడం, గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడం, కో-ఆపరేటివ్ ఫెడరలిజాన్ని ప్రోత్సహిస్తామనే ప్రధానమంత్రి వాదనకు విరుద్ధమైనవని అన్నారు.
సహకారం, కేంద్రీకరణ వంటి రాష్ట్ర విషయాలపై దాడిని సమిష్టిగా ప్రతిఘటించాలని అన్నారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద విధానాలు శ్రామిక ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. దాదాపు 400 మంది ప్రాణాలను బలిగొన్న, 100 మందికి పైగా తప్పిపోయిన వాయనాడ్ కొండచరియల విపత్తు బాధితులకు సహాయం అందించడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని అన్నారు. విపత్తు తీవ్రత ఉన్నప్పటికీ, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, సహాయాన్ని అందించాలని కేరళ చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని గుర్తుచేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేరళ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నదని అన్నారు. పింఛన్లు, ఎంఎస్‌పి, కార్మిక హక్కుల పరిరక్షణ, గృహాలు, విద్య, ఆరోగ్య సౌకర్యాల ద్వారా కార్మికులు, రైతుల హక్కులను కాపాడటానికి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వామపక్ష రక్షణగా ఎదగడం మన కర్తవ్యం అని అన్నారు.
మత కార్పొరేట్ నిరంకుశ పాలన ద్వారా ప్రత్యామ్నాయ దాడులను నిరోధించాలని అన్నారు. 3 సంస్థలు సంయుక్తంగా రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలలో డిసెంబర్ 10, 11 తేదీలలో జరిగే సంఘీభావ దినాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 10న హైదారాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు ఎ.విజయ రాఘవన్, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ తదితరులు పాల్గొన్నారు.




