28 July, 2026 | 5:29 PM

ఐజీ రంగనాథ్‌కు కీలక బాధ్యతలు

25-06-2024 04:55 AM
  • జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఎండీఏ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా నియామకం
  • పోస్ట్ అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి) : రాష్ట్రంలో సోమవారం జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలో ఐజీ రంగనాథ్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మల్టీజోన్ ఐజీగా ఉన్న ఐజీ ఏవీ రంగనాథ్‌ను జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఎండీఏ పరిధి మొత్తానికి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వరకు మాత్రమే పరిమితమైన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పోస్ట్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధి బాధ్యతలను కూడా రంగనాథ్‌కు అప్పగించారు.

దీంతో, ఇకపై హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు, నాళాల ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలను నిర్మూలించే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్‌గా ఏవీ రంగనాథ్ వ్యవహరించనున్నారు. ఈ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగం సీఎం పర్యవేక్షణలో పని చేయనుంది. ఇందుకోసం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ(ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్)లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  

రంగనాథ్ ముందు అనేక సవాళ్లు..

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను సంరక్షించడంతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్ల పట్ల కఠినంగా వ్యవహరించే యోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇందుకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని కబ్జాల మీద ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పోలీసు శాఖలో సమర్ధుడిగా పేరున్న రంగనాథ్‌కు ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలు అప్పగించింనట్లు తెలుస్తోంది. అయితే, ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రంగనాథ్‌కు రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు అప్పగించడంపై తీవ్రచర్చ నడుస్తోంది.