ఖలిస్థానీ ఘాతుకం!
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు ప్రతీకారంగా ఖలిస్థానీ గ్రూపు బబ్బర్ ఖల్యా 40 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో బాంబులు పెట్టి కూల్చేసింది. ఇది ఖలిస్థానీ ఉగ్రవాదుల పనేనని భారత్ ఆనాడే ప్రకటించింది.
1985, జూన్ 23న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 329 మంది ప్రాణాలు జల సమాధి అయ్యారు. మరణించిన వారిలో కెనడా వారే ఎక్కువ. కెనడా నుంచి ముంబైకి బయలుదేరిన బోయింగ్ 747 ‘కనిష్క’ విమానం ఆ రోజు ముక్కలు ముక్కలై అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. 329 మంది ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ ‘ఖలిస్థాన్’ గ్రూపులు కెనడా నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్నాయని చెబుతున్న భారత్ మాటలను కెనడా పెడచెవిన పెడుతూనే వస్తున్నది.
అయితే ఇప్పుడు.. 40 ఏళ్ల తర్వాత ‘కనిష్క’ ఘాతుకం ఉగ్రవాదం పనేనని కెనడా అంగీకరించింది. కెనడాలో ఇంతకాలం మైనారిటీలుగా తగిన ప్రాధాన్యతను కలిగివున్న సిక్కులలో ఉగ్రవాద గ్రూపులకు ఇది ఒకవిధంగా శరాఘాతమే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో కెనడా గడ్డ మీద భారత్ రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నట్టు రుజువైందని కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రమైన ప్రకటన చేసినప్పటినుంచి భారత్, కెనడా మధ్య దౌత్య సం బంధాలు మసకబారాయి.
ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమైందని భారత్ అనేక సంఘటనలను కెనడా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. 2025లో మా ర్క్ కార్కీ కెనడా ప్రధాని అయిన తర్వాత భారత్, కెనడా దౌత్య సంబంధాలు మెరుగయ్యాయి. అందులో భాగంగానే ఇన్నేళ్లకు ‘కనిష్క’ దుర్ఘటన ఖలిస్థాన్ ఉగ్రవాదుల ఘాతుకమేనని కెనడా భద్రతా గూఢచర్య సర్వీసు (సీఎస్‌ఐఎస్) మొదటిసారిగా ప్రకటించింది. ఆనాటి ఘటన ఉగ్రవాద చర్య అని కెనడా ప్రకటించడం, ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయంలో భారత్ వాదనకు ఆమోదం లభించినట్టయింది.
కొన్ని ఖలిస్థానీ గ్రూపులతో తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని కెనడా ఇప్పుడు గమనించింది. నిజానికి తమ హింసాత్మక ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఆ గ్రూపులు కెనడా భూభాగాన్ని వాడుకుంటున్నాయి. దానితో అంతర్జాతీయంగా కెనడా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ఖలిస్థానీ గ్రూపులు తమ అవసరాల కోసం, హింసాత్మక కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్న విషయాన్ని సీఎస్‌ఐఎస్ తన నివేదికలో పేర్కొంది. శాంతియుత పద్ధతుల్లో ప్రత్యేక ఖలిస్థానీ దేశాన్ని కోరడం కెనడా అతివాదంగా పరిగణించడంలేదు.






