4 July, 2026 | 12:38 AM

9న ఖమేనీ అంత్యక్రియలు

04-07-2026 12:00 AM

టెహ్రాన్‌కు ఖమేని భౌతిక కాయం

నేటి నుంచి అంతిమ కార్యక్రమాలు షురూ

చివరిరోజు స్వస్థలం మషాద్‌లో ఖననం

ప్రత్యక్షంగా ౨ కోట్ల మంది వరకు పాల్గొనే అవకాశం

టెహ్రాన్, జూలై ౩: అమెరికా -ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కన్నుమూసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈనెల ౪ లేదా ౫వ తేదీల్లో షియా సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు ప్రారంభంకానున్నాయి.

అది మొదలు ఇదే నెల ౯ వరకు ఇరాన్, ఇరాక్ దేశాల్లోని పలు నగరాల మీదుగా అంతిమ యాత్ర సాగనుంది. చివరిరోజు ఖమేనీ స్వస్థలమైన మషాద్‌లో అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో ఖనన కార్యక్రమం పూర్తికానుంది. దీనిలో భాగంగానే ఖమేనీ భౌతికకా యాన్ని తాజాగా దేశ భద్రతా విభాగం, పోలీస్ యంత్రాంగం దేశ రాజధాని టెహ్రాన్‌కు తరలించింది. అక్కడి నుంచి గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచింది. ఖమేనీ అంతిమయాత్రకు రికార్డు స్థాయిలో ౨ కోట్ల మంది వస్తారని ఇరాన్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

మరోవైపు, ఖమేనీ మరణించి నాలుగు నెలలు దాటినప్పటికీ, ఆయన భౌతికకాయాన్ని ఎలా భద్రపరిచారనే అంశంపై ఇప్పుడు చర్చనడుస్తున్నది. సాధారణంగా ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం, ఒక వ్యక్తి మరణిస్తే తక్షణం అంత్యక్రియలు పూర్తిచేయాలి. కానీ, ఖమేనీ విషయంలో అలా జరగలేదు. దేశ సుప్రీం లీడర్ హోదాలో ఉన్న వ్యక్తికి మతపరమైన మినహాయింపులు ఉంటాయని ఇస్లాం మతపెద్దలు చెబుతున్నారు. ఖమేనీ భౌతికకాయాన్ని కూడా ఎలాంటి రసాయనాలను వినియోగించకుండానే, రిఫ్రిజిరేటర్ కోల్డ్ స్టోరేజీలోనే భద్రపరిచి ఉంటారని తెలిసింది.

అమెరికాను వెంటాడుతున్న భయాలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు ముమ్మరంగా జరుగుతున్న వేళ అమెరికాను కొన్ని భయాలు వెంటాడుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనా లు ప్రసారమవుతున్నాయి. ఈ కథనాల ప్రకారం.. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రభుత్వ పెద్దలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసి, మట్టుపె డుతుందని అమెరికా ఆందోళన చెందుతున్నదట. ఆ జాబితాలో ఇరాన్ విదేశాం గమంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.

అంతేకాదు.. ఈ మేరకు గల్ఫ్ దేశాల ప్రజాప్రతినిధులతోనూ అమెరికా అధికారులు టచ్‌లోకి వెళ్లారట. ఇజ్రాయెల్ సైన్యం కదలికలను పసిగట్టి, ఎప్పటికప్పుడు ఇరాన్‌కు చేరవేయాలని గల్ఫ్ ప్రభుత్వ పెద్దలకు సూచించారట. ఖమేనీ మరణం తర్వా త ఆ దేశ ఉన్నతస్థాయి నేతలు అలీ లారిజానీ, కమాల్ ఖరాజీని అమెరికన్, ఇజ్రా యెల్ సైన్యాలు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దాడుల విషయంలో అమెరికా కాస్త వెనక్కితగ్గినప్పటికీ, ఇజ్రాయెల్  వెనక్కితగ్గేటట్టు కనిపించడం లేదు.