పెద్దపల్లిలో దారుణం ఆరేండ్ల బాలిక కిడ్నాప్.. హత్యాచారం
- సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో అమానుషం
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
సుల్తానాబాద్ (మంథని), జూన్ 14 (విజయక్రాంతి): అభం శుభం తెలియని చిన్నారిపై అమానుషత్వం.. మృగంలా అత్యాచారానికి పాల్పడి.. ఆ చిన్నారిని నులిపేసిన దారుణ ఘటన ఇది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో ఈ ఘాతుకం జరిగింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంకు చెందిన ఎలకరి మహేష్,సాలక్క అనే దంపతులు తమ కూతుళ్లు సహస్ర (6), మేఘన (ఏడునెలలు)తో 15 రోజుల క్రితం కాట్నపల్లి సమీపాన గల మమత రైస్ మిల్లులో కూలీలుగా చేరారు. ఎప్పటి మాదిరిగానే గురువారం రాత్రి మిల్లులో పనులు ముగిసిన అనంతరం తమ ఇంటిలో ఉండగా సాయంకాల సమయంలో విపరీతమైన గాలి దుమారం, వర్షం రావడంతో కరెంటు పోయింది.
విపరీతమైన ఉడకపోతకు తట్టుకోలేక మహేష్, సాలక్క రాత్రి 9 గంటల వరకు వేచి చూసి అనంతరం ఆరుబయట నిద్రించారు. ఇది గమనించిన బీహార్‌కు చెందిన వినోద్ నిద్రిస్తున్న కుటుంబాన్ని పరిశీలించి, మహేష్, సాలక్క కూతురు సహస్ర( 6)ను అపహరించుకొని పోయి పక్కనే ఉన్న రైస్ మిల్లు పొదల్లో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం బాలికను హత్య చేశాడు. బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని గమనించి వెంటనే రైస్ మిల్లు గుమాస్తాకు సమాచారం అందించారు. తర్వాత స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, సీఐ సుబ్బారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీసులు మిల్లు సమీప పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో ఆ బాలిక విగత జీవిగా కనిపించింది.
దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, నల్ల మనోహర్ రెడ్డి, బూర్ల సత్యనారాయణ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఉపేక్షించేది లేదని పోస్టు మార్టం గది ముందు ధర్నాకు దిగి మిల్లు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడిని తక్షణమే ఎన్‌కౌంటర్ చేయాలని ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపచేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడి అరెస్టు
ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన ఘటనలో నిందుతున్ని అరెస్ట్ చేసినట్టు రామగుండం సీపీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సీపీ ప్రెస్‌నోట్‌లో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమత రైస్ మిల్‌లో నేరస్థుడు బీహార్ వాసి వినోద్ మజ్హి రాజ్‌కుమార్ (28) హమాలీగా పనిచేస్తున్నాడు. తన రూమ్ దగ్గరలో ఉన్న మరో రూమ్‌లో మృతురాలి కుటుంబం ఉండేది. గత గురువారం రాత్రి కరెంట్ పోవడంతో నేరస్థుడు బయటకు వచ్చి చూసేసరికి, చిన్నారి తన తల్లిదండ్రులతో ఆరుబయట పడుకున్నారని, అదే అదునుగా భావించిన నేరస్థుడు బాలికను ఎత్తుకెళ్లాడు. రైస్ మిల్ వెనుక వైపు తీసుకెళ్లి లైంగికదాడి చేసి అనంతరం చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని సీపీ పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో సుల్తానాబాద్ పోలీసులు రాత్రంతా గాలించి నిందితుడిని పట్టుకున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ వెల్లడించారు.






