భద్రతకు రైల్వేల ప్రత్యేక ఆపరేషన్లు
ప్రయాణాన్ని సుఖమయం చేస్తున్న రైల్వే భద్రతా దళం
మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ అరికట్టడంలో కృషి
58 మంది చిన్నారులను కాపాడిన ఆర్పీఎఫ్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రైల్వే ఆస్తులను కాపాడటమే కాదు, ప్రయాణీకుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ మానవ అక్రమ రవాణాను అరికడుతున్న రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్) వివిధ ప్రత్యేక ఆపరేషన్ల పేరుతో విశేషంగా సేవలు అందిస్తున్నది. రైల్వే ఆస్తుల రక్షణ, ప్రయాణీకుల భద్రతను కాపాడటంలో ఆర్పీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఆర్పీఎఫ్ దోపిడీకి గురైన సొమ్మును త్వరగా రికవరీ చేయడమే కాకుండా తప్పిపోయిన పిల్లలనూ వారి తల్లితండ్రుల చెంతకు చేరుస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి పసిమొగ్గలను కాపాడుతోంది. మత్తు పదార్థాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఆపరేషన్ యాత్రి సురక్ష...
రైలులో, స్టేషన్లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆభరణాలను దొంగిలించే వారిపై ఆర్పీఎఫ్ ప్రత్యేక నిఘా వేస్తారు. దొంగిలించిన వస్తువులను ఆపరేషన్ యాత్రి సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయాణీకులకు చేరవేస్తారు. దొంగతనానికి గురైన రూ.29.58 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసింది ఆర్పీఎఫ్. ఈ ఘటనలకు సంబంధించిన వారిపై 53 కేసులు నమోదు చేసింది. సీసీటీవీలను ఉపయోగించుకొని 4 నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి రూ.1,4 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వస్తువులను రికవరీ చేసి వాటిని యజమానులకు అప్పగించేందుకు ఆపరేషన్ అమానత్ ద్వారా ఆర్పీఎఫ్ కృషి చేస్తోంది. ఒక్క మే నెలలోనే 243 ప్రయాణికులకు చెందిన సుమారు రూ.57లక్షల విలువైన సామానును స్వాధీనం చేసుకుని వాటిని యజమానులకు తిరిగి అందించింది.






