15 August, 2026 | 10:06 PM

త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు... ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జిగా కిషన్ రెడ్డి!

17-06-2024 05:33 PM

న్యూఢిల్లీ: త్వరలో పలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్ ఛార్జులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ తరుపున ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని పలువురు కేంద్రమంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించింది. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ కు ఎన్నికల ఇన్ ఛార్జీగా బీజేపీ నియమించింది. 

మహారాష్ట్రకు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ (ఇన్ ఛార్జీ), అశ్వనీ వైష్ణవ్ (సహ ఇన్ ఛార్జీ), హరియణాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (ఇన్ ఛార్జీ), త్రిపుర మాజీ సీఎం బిప్టవ్ దేవ్ కుమార్  (సహ ఇన్ ఛార్జీ), ఝార్ఖండ్ కు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (ఇన్ ఛార్జీ), అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ  (సహ ఇన్ ఛార్జీ)లను నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూకాశ్మీర్ లో సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాలన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇన్ ఛార్జీలను నియమిస్తూ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది.