పేరుకే కల్వకుర్తి.. కానరాని సాగునీరు!
ఓవైపు కాల్వలు ఎత్తిపారుతున్న నీరు మరోవైపు చుక్కనీటికీ నోచుకోని రైతులు.
కేఎల్‌ఐ నీటి నిర్వహణ అస్తవ్యస్తం
క్షేత్రస్థాయిలో పరిశీలించని అధికారులు
దెబ్బతింటున్న పంటలు
కల్వకుర్తి, ఆగస్టు 25: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫలితాలు కల్వకుర్తి ప్రాంతానికి అందడం లేదని దానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు పేరు కల్వకుర్తిగా పిలవబడుతున్న ఈ ప్రాంతానికి చుక్క నీరు కూడా అందడం లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటిపై ఆధారపడిన రైతులకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటి నిర్వహణ సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో అధికారులు నీటిని విడుదల చేసినప్పటికీ, అది ప్రధాన కాలువలకే పరిమితమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల నిర్వహణ సరిగా లేక పోవడంతో కొన్ని ప్రాంతాల్లో చిన్న కాలువలకు నీరు చేరక పంటలు ఎండిపోతుండగా, మరికొన్ని చోట్ల అధికంగా నీరు వెళ్లి పంటలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.
కల్వకుర్తి పరిధిలోని 29వ ప్యాకేజీ నుంచి అనేక కాలువలకు ఇప్పటికీ నీరు పారక పోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. విలువైన భూముల్లో కాలువలు నిర్మించి ఏళ్ల తరబడి నీరు పారకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో కాలువలపై ఆధార పడకుండా పంటలు సాగు చేసిన రైతులు, ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా కాలువ నీటిపైనే ఆధారపడుతున్నారు.
కాలువల ద్వారా నీటి సరఫరా ప్రారంభమై సుమారు రెండు వారాలు గడుస్తున్నా డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీరు చేరకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. నీటి మట్టాల నిర్వహణ కోసం అధికారులు తూములు ఏర్పాటు చేసినప్పటికీ, కొంతమంది రైతులు వాటిని ఇష్టానుసారంగా తిప్పడంతో కొన్ని కాలువలకు అధికంగా నీరు వెళ్తోందని, ప్రధాన కాలువకు సమాంతరంగా ఉన్న మరికొన్ని కాలువలకు నీరు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు. కాలువల ద్వారా నీరు ప్రవహిస్తున్నా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని విమర్శలు ఉన్నాయి.
కేవలం కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకే పనులు చేస్తున్నారు తప్ప ఎక్కడ పర్యటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్వకుర్తి మండలంలోని డి-74 కాలువకు ఇప్పటి వరకు నీరు చేరలేదని రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ దానికి అనుబంధంగా కాలువలు నిర్మించి విలువైన పొలాలను తవ్వి వదిలేశారని, నీరు పారకపోవడంతో అవి ఎందుకూ ఉపయోగపడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డి-63 కాలువలోనూ నీటి నిర్వహణ సక్రమంగా లేక పోవడంతో కాలువలపై నుంచి నీరు పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు అంటున్నారు.
ఇలా ఒకవైపు నీరు అందక పంటలు ఎండిపోతుండగా, మరోవైపు అధిక నీటితో పంటలు దెబ్బ తింటుండటంతో కాలువల నిర్వహణ రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కార్యాలయాలకే పరిమితమై క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో కాలువలను పరిశీలించి, నీటి ప్రవాహాన్ని సక్రమంగా నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. డిస్ట్రిబ్యూటరీ, పిల్ల కాలువలకు సమానంగా నీరు అందేలా చర్యలు తీసుకుని, వర్షాభావ పరిస్థితుల్లో సాగు సంక్షోభాన్ని నివారించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






