23 March, 2026 | 1:59 AM

సీతారాముల కల్యాణానికి రారండి..!

23-03-2026 12:20 AM

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే 

పటాన్చెరు, మార్చి 22: శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 25 తేదీ నుండి 29వ తేదీ వరకు పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం దేవాలయం ఆవరణలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రజలు, భక్తుల సహకారంతో ప్రతి ఏటా ఐదు రోజుల పాటు వేద మంత్రోచ్ఛరణాల మధ్య భక్తుల జయ జయ ధ్వనాలతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో అభిజిత్ లగ్న సుముహూర్తమున శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాలను దిగ్విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అర్చక స్వామి నరసింహచార్యులు, సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, పృథ్వీరాజ్, అశోక్, వెంకటేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.